TG: బీఆర్ఎస్‌కు షాక్.. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్

TG: బీఆర్ఎస్‌కు షాక్.. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్
X
పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్లపై కేసు.. ఖండించిన మాజీ మంత్రులు

గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్‌ నేత, రాష్ట్ర తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ వెస్ట్‌మారేడ్‌పల్లిలో ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని మాసాబ్ ట్యాంక్ పీఎస్‌‌కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎర్రోళ్లపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఈ ఉదయం నోటీసులు ఇచ్చేందుకు వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు శ్రీనివాస్ ఇంటికి భారీగా చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మాసబ్‌ట్యాంక్ పీఎస్‌కు తరలించారు. కాగా, పోలీస్ విధుల అడ్డగింతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంతమందిపై గతంలో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు.

అరెస్టును ఖండించిన మాజీ మంత్రి

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అరెస్టుపై ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతల మీద కేసులు అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు.

అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఎర్రోళ్ల

తన అరెస్టుపై ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అక్రమంగా తనను అరెస్ట్ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తోందని.. 14 ఏళ్ల పాటు ఉద్యమంలో పాల్గొన్నానని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పని చేశానని చెప్పారు. తెల్లవారుజామున వచ్చి ఇంటి డోర్లు కొట్టడమేంటని నిలదీశారు. ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధించినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

శ్రీనివాస్ అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?' అని ప్రశ్నించారు. 'అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు.. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య పాలనని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.

Tags

Next Story