BRS: హైకమాండ్‌పై తిరుగుబాటుకు సిద్ధమైన పలువురు నేతలు

బీఆర్‌ఎస్‌లో అసమ్మతి రచ్చకెక్కింది. టికెట్లు దక్కని సిట్టింగ్‌లు అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారు. అభ్యర్థుల జాబితా విడుదలతో వెల్లువెత్తిన అసంతృప్తిని చల్లబరిచేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. పలువురు నేతలకు పదవులిస్తామని హామీలిచ్చారు. తిరుగుబాటుకు సిద్ధమైనవారికి ఏదో ఒక పదవిలో సర్దుబాటు చేస్తామంటూ ఆశలు కల్పిస్తున్నారు. మరోవైపు కొందరు నేతలు మాత్రం తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. పదవీకాలం పూర్తయ్యేవరకు బీఆర్‌ఎస్‌లోనే ఉంటానన్నారు. రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు కేసీఆర్ టికెట్లు కట్ చేశారు. ఆత్రం సక్కుకు ఆయన పార్లమెంట్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు కూడా పార్లమెంట్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. జనగాంలో ముత్తిరెడ్డికి ఇవ్వకుంటే తనకు టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు బీఆర్‌ఎస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు పార్టీ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చింది. అయితే ఎమ్మెల్సీ పదవి వద్దంటున్న వీరేశం తన అనుచరులతో సమావేశం అయ్యారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌లో పొంగులేటికి కొత్తగూడెం టికెట్ ఖరారు కావడంతో ఆయన డైలమాలో పడ్డట్టు తెలిసింది. తుమ్మల నాగేశ్వరావుకు కీలకపదవి ఇస్తామని బీఆర్‌ఎస్ హైకమాండ్ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇక మెదక్‌లో తన కుమారుడు కచ్చితంగా పోటీ చేస్తారని మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే మాల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్ టికెట్ మీద పోటీచేయాలంటూ మైనంపల్లి మొదట హరీష్‌రావుకు క్షమాపణలు చెప్పాలని....పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు మైనంపల్లి స్థానంలో మరొకర్ని మాల్కాజ్‌గిరి బరిలోదించాలని కూడా అధిష్టానం ఆలోచిస్తోంది.
రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవాలని కేసీఆర్ నిర్ణంచారు. తాండూరు సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయనకు మంత్రిపదవితో సర్దుబాటు చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి సైతం పట్నం ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరారు. మొత్తానికి అసమ్మతి పెరగకుండా టీఆర్‌ఎస్ అధిష్టానం సాధ్యమైనంతవరకు సర్దుబాటు ఫార్మాలాతో పలువుర్ని చల్లబరించింది. పదవుల ఆఫర్‌తో వారిని కూల్ చేసింది. అయితే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలానే ఉంటుదనేది కష్టమే....అప్పటివరకు తిరుగుబాటు చేసే వారి సంఖ్య మరింత పెరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com