శ్రీకాంతాచారి తల్లికి BRS అధిష్టానం నుంచి పిలుపు

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైదరాబాద్‌కు రావాలని సూచించడంతో పాటు నేడు జరిగే అమరవీరుల స్మృతి వనం ఆవిష్కరణలో పాల్గొనాలని పార్టీ కోరింది. దీంతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంకరమ్మను మంత్రి జగదీశ్ రెడ్డి వెంట తీసుకొని అమరవీరుల స్తూపం దగ్గరికి తీసుకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.
శంకరమ్మ గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2014లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శంకరమ్మకు కాకుండా సైదిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అప్పటినుంచి శంకరమ్మ అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్ళిన మంత్రి కేటీఆర్‌ను శంకరమ్మ కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఇక సీఎం కేసీఆర్ ను సైతం శంకరమ్మ కలిసి తనకు రాజకీయ అవకాశం కల్పించాలని, ఏదైనా ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందుకోసం అభ్యర్థుల కసరత్తు జరుగుతుంది. ఈ తరుణంలోనే అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు ఆందోళన బాట పట్టారు. నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నాడంతో రాబోయే ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో శంకరమ్మను ఎంపిక చేయనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే శంకరమ్మకు గన్‌మెన్, పీఏ, వాహనాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com