BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత !

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ సహా సునీత పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి.. మాగంటి సునీత పాల్గొన్నారు.ఈ సమావేశంలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తల పనితీరు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఇంచార్జ్‌లను నియమించింది. కార్యకర్తలకు కేటీఆర్.. దిశానిర్దేశం చేస్తున్నారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే నేపథ్యంలో గోపీనాథ్ భార్య సునీతకే బీఆర్ఎస్ టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాగంటి సునీత తన ఇద్దరు కూతుళ్లు అక్షర, దిశిరను జనాల్లోకి పంపుతున్నట్లు తెలుస్తోంది. మాగంటి సునీతను త్వరలోనే అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల ప్రచారం ఆరంభించాలని బీఆర్ఎస్ చూస్తోంది.
సునీతకు ఆశీస్సులు ఉండాలి: కేటీఆర్
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో భారత రాష్ట్ర సమితి గెలుపే గోపీనాథ్‌కు సరైన నివాళని తెలిపారు. అందరూ ఆశీర్వదిస్తే గోపీనాథ్ కుటుంబం మళ్లీ గౌరవంగా ఉంటుందన్నారు. మాగంటి సునీత మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్‌కు అండగా నిలిచినట్లే తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గోపీనాథ్ ఆశయాలు నెరవేర్చేందుకు అందరమూ కలిసి పనిచేద్దామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com