తెలంగాణ వెనకపడిపోతోంది: హరీశ్ రావు

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి మండిపడ్డారు. 2025 మార్చి నెల తెలంగాణ జీఎస్టీ వృద్ధి 0%కు పడిపోవడంపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. దేశవ్యాప్తంగా సగటు జీఎస్టీ వృద్ధి రేటు 10% ఉండగా, తెలంగాణ రాష్ట్రం దేశీయ వృద్ధి రేటుతో పోలిస్తే చాలా వెనకబడి ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. “జీఎస్టీ వృద్ధి 12.3%గా ఉందని శాసనసభలో ప్రకటించడం శోచనీయం” అని హరీశ్ రావు అన్నారు. అయితే, అధికారిక గణాంకాలను పరిశీలిస్తే భట్టి విక్రమార్క వాదనలు పూర్తిగా అవాస్తవమైనవిగా తేలిపోయాయని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు క్రమంగా తగ్గడానికి గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కారణమని హరీశ్ రావు పేర్కొన్నారు. “క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అమలులో లోపాలు, రైతు భరోసా ద్వారా పంట పెట్టుబడి సహాయం అందించకపోవడం, రైతు భరోసా పథకం కింద రూ.12,000 కోట్ల నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు సామర్థ్యం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com