Kadiam Srihari: కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్యతో కలిసి ఆదివారం ఉదయం సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కావ్య పేరును ప్రకటించే అవకాశం ఉంది. కడియం శ్రీహరి, కావ్యలు శనివారమే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే, శ్రీహరి తన నియోజకవర్గంలో ఆయన వర్గీయులతో సమావేశం అయ్యారు. సమావేశం ఆలస్యం కావటంతో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన సమయానికి చేరుకోలేక పోయారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి సచివాలయంలో పలు సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో శనివారం కడియం శ్రీహరి, ఆమె కుతురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆదివారం ఉదయమే రేవంత్ నివాసానికి చేరుకున్న కడియం శ్రీహరి, కావ్యలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ మున్షీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం సీటును బీఆర్ఎస్ అధిష్టానం కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు కేటాయించింది. దీంతో కడియం పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడింది. కానీ, ఊహించని రీతిలో కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈమేరకు బీఆర్ఎస్ అధిష్టానంకు కావ్య లేఖ రాశారు. అనంతరం కడియం శ్రీహరి, కావ్య ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com