TG: మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్ట్

ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. ఆందోళనలు.. అరెస్టులు.. నిరసనలతో తెలంగాణ హోరెత్తిపోయింది. కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి అరెకపూడి గాంధీ భారీగా తన అనుచరులతో బయల్దేరి వెళ్లారు. గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్ కండువా కప్పుతానని ఇటీవల కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై అరెకపూడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్‌రెడ్డిలాంటి కోవర్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తన ఇంటికి ఆయన రాకపోతే.. తానే ఆయన ఇంటికి వెళతానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి ఇంటికి అరెకపూడి గాంధీ వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కొంతమంది అరెకపూడి అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు.
కౌశిక్‌రెడ్డి ఇంటివద్ద తన అనుచరులతో కలిసి అరెకపూడి గాంధీ బైఠాయించారు. పోలీసులు ఆయన్ను పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌రెడ్డిని బయటకు పిలవాలని.. లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అరెకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
దాడిని నిరసిస్తూ ఆందోళన
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు సీపీ ఆఫీస్ వద్దకు బీఆర్‌ఎస్ నేతలు భారీగా తరలివచ్చారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్ నేతలను వాహనాల్లో పడేశారు. హరీశ్‌రావును పోలీసులు లాక్కువెళ్లేందుకు ప్రయత్నించగా హరీశ్‌రావు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతికి గాయమైంది. బీఆర్ఎస్ నేతలు.. అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్ నేతలను శంషాబాద్ పీఎస్‌కు తరలించారు. దాడి చేసిన వాళ్లను అరెస్ట్ చేయమని ప్రశ్నించినందుకు తమను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ నేతలను వాహనాలలో తరలిస్తున్న సమయంలో పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు ఉన్న వాహనం పీఎస్ వద్దకు రాగానే నేతలంతా ఆందోళనకు దిగారు. వారి మధ్య నుంచి హరీష్ రావు నొప్పితో బాధ పడుతూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com