Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

పండగ పూట తెలంగాణలో పొలిటికల్ ఫైట్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళిక రూపొందించేందుకు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడ్డుకొని, దాడికి యత్నించారని సంజయ్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య, ఆర్డీవో కె.మహేశ్వర్, సుడా చైర్మన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసులు కౌశిక్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి... రాత్రి 10.40 గంటలకు కరీంనగర్ తీసుకొచ్చారు. ఆయన్ను కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉంచారు. ప్రాథమిక విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు.
బీఆర్ఎస్ ఆందోళన
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పెద్దఎత్తున నిరసనకు దిగిన బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టును ఖండించిన కేటీఆర్
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి సర్కార్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన అసమర్థ, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ రాజ్యం ఇదేనా.. ?
కౌశిక్‌రెడ్డిని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, అడిగితే అరెస్టులు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 13 నెలల పాలనలో తెలంగాణ కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమన్నారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇపుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అణచివేతలు, నిర్బంధాలకు బీఆర్‌ఎస్ పార్టీ భయపడదని హరీశ్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com