TG: కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్
తెలంగాణలో కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంజయ్‌కుమార్‌కు రేవంత్ రెడ్డి కండువా కప్పు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో సంజయ్ హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేతగా పని చేస్తూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఐదుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ అధికార పార్టీలో చేరడంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బలం 39 నుంచి 34కి పడిపోయింది. నవంబర్ 2023లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సంజయ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.
రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష
తెలంగాణలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ ఒకేచోట ఉండేలా 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో క్యాంపస్ లు నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి వెల్లడించారు. దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లోనూ క్యాంపస్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ల నిర్మాణం కోసం ఆర్కిటెక్ట్ లు రూపొందించిన నమూనాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా, అన్ని సౌలతులు ఉండేలా అత్యాధునిక బిల్డింగులను నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలు సిద్ధం చేసుకోవాలని, స్థలాలు అందుబాటులో ఉన్న నియోజకవర్గాల్లో వెంటనే నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు దీటుగా ఈ క్యాంపస్ లు ఉండాలన్నారు. గురుకులాలను ఒకేచోట నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుందని.. కుల, మత వివక్ష తొలగిపోతుందని భావిస్తోంది. అదే విధంగా గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత సమర్థంగా నిర్వహించేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com