Challa Venkatrami Reddy: కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..

కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి... కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజాగా, బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎంను ఎమ్మెల్సీ చల్లా కోరినట్లు తెలుస్తోంది. చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇవ్వకపోయినా.. రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరోవైపు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. తొలుత ఈనెల 9న మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితర ప్రధాన అంశాలపై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సమయంలో చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com