KAVITHA: సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్
ఢిల్లీ మద్యం కేసులో తన అరెస్టు చట్టాల ఉల్లంఘనతో పాటు ప్రాథమిక హక్కుల హననం కిందికి వస్తుందని MLC కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరించిందన్నారు. తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు వివరించారు. అక్రమ నగదు ఆరోపణలకు దర్యాప్తు సంస్థ ఒక్క ఆధారాన్ని చూపలేదన్న కవిత..అరెస్టు ఉత్తర్వుల్లోని కారణాలు అవాస్తవాలని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేకపోయినా తనను ఇరికించేలా ED దర్యాప్తు చేపడుతోందని MLC కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేసులో నమోదైన F.I.R సహా అభియోగ పత్రాల్లో ఎక్కడా తనను నిందితురాలిగా పేర్కొనలేదని వివరించారు. 2022లో CBI ఏడు గంటలపాటు విచారించిందన్న కవిత ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితురాలిగా చేర్చలేదని తెలిపారు. కొందరి వాంగ్మూలాల ఆధారంగా తనను మద్యం కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దిల్లీ మద్యం విధానాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని కవిత పేర్కొన్నారు. ED దర్యాప్తు పారదర్శకంగా కొనసాగట్లేదన్న కవిత సాక్షులపై థర్డ్ డిగ్రీ పద్ధతులను వినియోగిస్తుందని ఆరోపించారు. ED అనుసరిస్తున్న కఠిన పద్ధతుల కారణంగానే P.శరత్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారినట్లు వివరించారు.
మరోవైపు సుప్రీం కోర్టులో ఇచ్చిన హామీకి విరుద్ధంగా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందన్న MLC...ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే దిల్లీకి తరలించినట్లు తెలిపారు. అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలు పూర్తిగా అవాస్తవమనీ.. ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ దరఖాస్తు సైతం తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. మనీ లాండరింగ్ చట్టం-2002లోని సెక్షన్ 19(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు తమ వద్ద సాక్ష్యాధారాల ఆధారంగా కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అన్నారు. దర్యాప్తు సంస్థ అలా చేయలేదు కాబట్టి...ED చర్యలు చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ వ్యతిరేకం, సుప్రీంకోర్టు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించడం కింద భావించి కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. మనీ లాండరింగ్ చట్టం-2002లోని సెక్షన్ 19ని మహిళపై ప్రయోగించడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించి.. అరెస్టును రద్దు చేయాలి అని కవిత కోరారు. మరోవైపు తన తల్లి, కుమారుడితోపాటు ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతివ్వాలని కవిత... రౌజ్ అవెన్యూ PMLA కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. సాయంత్రం ఓ గంట పాటు... దరఖాస్తులో పేర్కొన్న వారు కవితను కలిసేందుకు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ అనుమతి ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com