BRS: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌

BRS: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌
కాంగ్రెస్‌లో చేరనున్న ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు!... రేవంత్‌రెడ్డితో భేటీ

ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది.. ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బస్వరాజు సారయ్య సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2020 లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేగా నియమితులయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరో ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతూ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో కేసీఆర్ ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ పదవి ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చారు. ఆయన కూడా అధికార కాంగ్రెస్ పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలవడంతో ఆయన చేరిక లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నిన్న సీఎం రేవంత్ వరంగల్ టూర్ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ పెద్దలను బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు కలిశారు. బసవరాజు సారయ్య, బండ ప్రకాష్ బీఆర్‌ఎస్‌ హయాంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. గతంలో వీళ్లు కాంగ్రెస్‌లోనే పనిచేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో సారయ్య మంత్రిగా కూడా పనిచేశారు. 2016లో బీఆర్‌ఎస్ తీర్థం తీసుకున్న బసవరాజు సారయ్య.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తు్న్నారు. ఇదిలాఉండగా.. ఇప్పటికే వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి ముఖ్య నేతలైన కడియం కడియం శ్రీహరి, పసునూరి దయాకర్‌, గుండు సుధారాణి కాంగ్రెస్‌లోకి చేరారు.

గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సున్నాకే పరిమితం కావడంతో భవిష్యత్ ఏంటనే చర్చ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రజలు బీఆర్ఎస్ ను విశ్వసించడం లేదని నేతలు డైలామాలో పడ్డారు. దీంతో పార్టీకి మనుగడ కష్టమనే భావనకు వస్తున్నారు నేతలు. ఇప్పటికే పలువురు ఘోర పరాభవంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంటే.. మరికొందరు ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజా పరిస్థితులను గమనిస్తే ఓడిపోయిన నేతలే కాకుండా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మార్పుపై సన్నాహాలు చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటులో బీఆర్ఎస్ ని సైడ్ చేసేసిన కాంగ్రెస్ ఇప్పుడు శాసన మండలిపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు.. హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. నిధులు, పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటని కేసీఆర్ ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం శాసనమండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. వారిలో 29 మంది బీఆర్ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్‌కు నలుగురు, బీజేపీకి ఒక్కరు.. ఎంఐఎం నుంచి ఇద్దరు, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Tags

Next Story