నేడు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

నేడు బీఆర్‌ఎస్ (BRS Party) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. కేసీఆర్ (KCR) ధ్యక్షతన శుక్రవారం 26న బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సిద్దిపేట జిల్లా (Siddipet District) ఎర్రవల్లిలోని (Erravalli) కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12:30 గంటలకు జరగనుంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ లోక్ సభ (Lok Sabha), రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ భేటీ కానున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాజా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ అస్వస్థతకు గురై తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడంతో నెలన్నరకు పైగా విశ్రాంతికే పరిమితమయ్యారు. సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. శుక్రవారం జరిగే సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ స్థితిగతులపై చర్చిస్తారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే చివరి సమావేశం కావడంతో కీలక బిల్లులు, ఇతర అంశాలపై లేవనెత్తాల్సిన అంశాలపై అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ అభిప్రాయం ఏమిటనేది ఆసక్తిగా మారింది.
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై రెండు జాతీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు చేతులు కలిపారని కేటీఆర్ ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పొత్తుపెట్టుకుని బీఆర్‌ఎస్‌పై పోరాడతాయని ఆరోపించారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను తొలగిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలైట్ బార్లను ఏర్పాటు చేయబోతోందని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోపు హామీల అమలుకు జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు హామీల్లో 13 హామీల అమలు తక్షణమే జరగాలన్నారు. రాష్ట్రంలో 57 మిలియన్ల మంది మహిళలు రూ.2,500 కోట్ల ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం..
లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం పార్టీ పార్లమెంటరీ సమావేశం, శనివారం పార్టీ మైనారిటీ విభాగం సమావేశం జరుగుతుందని తెలిపారు. శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ ఎన్నికల సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com