General Elections 2023: ఎన్నికల శంఖారావం మోగించిన కేసీఆర్‌

General Elections 2023: ఎన్నికల శంఖారావం మోగించిన కేసీఆర్‌
జాబితాలో రెడ్డి-40,వెలమలు-11, కమ్మ-5, బీసీ-23... ఎస్సీ-19, ఎస్టీ-12, మైనార్టీ-3, బ్రాహ్మణ-1, వైశ్య-1

తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం మోగించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ...115 స్థానాలకు సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల్ని ప్రకటించారు. సిట్టింగ్‌ల్లో ఏడుగురికి మొండిచేయి చూపారు. జాబితాలో రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేశారు. అభ్యర్థుల్లో 40 మంది రెడ్డీలున్నారు. 11 మంది వెలమలకు, కమ్మ సామాజివర్గానికి చెందిన ఐదుగురికి, 23 మంది బీసీలకు, 19 మంది ఎస్సీలకు, 12 మంది ఎస్టీలకు, ముగ్గురు మైనార్టీ, ఒక బ్రాహ్మణ, ఒక వైశ్య అభ్యర్థికి జాబితాలో చోటు దక్కింది. పౌరసత్వం వివాదం కారణంగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు టికెట్‌ కేటాయించలేదు. ఇక ఈ సారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్‌ చెప్పారు. గజ్వేల్‌, కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అందులో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. సోమవారం మంచి ముహూర్తం కావడంతో అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్టు కేసీఆర్‌ తెలిపారు.

టికెట్‌ దక్కని అభ్యర్థులు నిరాశ చెందవద్దని కేసీఆర్‌ సూచించారు. వారికి ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌, కామారెడ్డి, వేములవాడ, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. అయితే కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తున్న కారణంగా గంపా గోవర్దన్‌ను పక్కన పెట్టారు. నాంపల్లి, గోషామహల్‌, నర్సాపూర్‌, జనగామ స్థానాలకు తొలిజాబితాలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేదు. త్వరలో ఆ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా అమలుచేశామన్నారు.

కంటోన్మెంట్‌ సీటును దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితకు కేటాయించారు. హుజారాబాద్‌లో కౌశిక్‌ రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు పోటీ చేస్తారని కేసీఆర్ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాన్ని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించినట్టు తెలిపారు. అక్టోబర్‌ 16న మేనిఫెస్టోను విడుదల చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story