నేడు బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం

ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగనుంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సభ్యులు భేటీ అవుతారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మీటింగ్‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. తర్వాత రాష్ట్రం సాధించిన ప్రగతిని ఆవిష్కరించనున్నారు.
ఈ నెల 13న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో 21 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులుగా పోషించాల్సిన పాత్రపై ఇవాళ జరిగే సమావేశంలో సూచనలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన తర్వాత కరీంనగర్ బహిరంగ సభ జరిగిన రోజు.. బీఆర్‌ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత అదే రోజు.. తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు కూడా హాజరుకావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు.
అదేవిధంగా రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ద శాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమావేశంలో చర్చించనున్నారు. సచివాలయం ఎదుట సిద్ధమైన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభ తేదీని ఖరారుచేసే అవకాశముంది. పోడు పట్టాల పంపిణీ తేదీలు, గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి అమలు కార్యచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయమై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది. గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీకాలం ఈ నెల 27తో ముగియనుంది. ఆ రెండు స్థానాలకు ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ ఆమోదించి గవర్నర్‌కు సిఫారసు చేసే అవకాశముంది.
గవర్నర్ వెనక్కి పంపిన రెండు బిల్లులతో పాటు ఇతర బిల్లుల విషయమై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశముంది. బిల్లులను మళ్లీ పంపాలని నిర్ణయిస్తే అందుకోసం ఉభయ సభలను సమావేశపర్చాల్సి ఉంటుంది. ఈ విషయమై కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందుకు సన్నాహక ప్రణాళికపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఎన్నికల కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com