BRS: ప్రజా పోరాటలకు బీఆర్‌ఎస్ సిద్ధం

BRS: ప్రజా పోరాటలకు బీఆర్‌ఎస్ సిద్ధం
X
ప్రజాక్షేత్రంలోకి గులాబీ పార్టీ అధినేత.. రాహుల్‌గాంధీ ఇంటిముందు ధర్నా..?

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాపోరాటాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ ప్రణాళిక రచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని. ఆరు గ్యారంటీలను అరకొరగా అమలు చేస్తున్నారని గులాబీ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. రుణమాఫీపై కూడా విమర్శలు చేస్తోంది. అన్నింటినీ కలిపి ఒకే సారి భారీ పోరాటం చేయాలని భావిస్తోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

డిసెంబర్​లో ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్

అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. తనను కలిసేందుకు వచ్చిన నేతలతో సమావేశమై పార్టీ గురించి, క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నారు. తాజాగా డిసెంబర్‌లో కేసీఆర్ తన తదుపరి కార్యాచరణ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌ మొదటి నుంచి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని భావించారు. అదే విషయాన్ని గతంలో కూడా బహిరంగంగా వెల్లడించారు. అయితే, ప్రభుత్వ వైఫల్యాల కారణంగా తనపార్టీకి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని అప్పట్లో పేర్కొన్నారు. కేసీఆర్‌ పార్టీ నేతలతో చర్చిస్తూ, ప్రజా సమస్యలను పట్టించుకోవాలని, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా స్థాయిలో పార్టీకార్యక్రమాలను వేగంగా నడిపించాలి, స్థానిక సమస్యలపై త్వరగా స్పందించాలని కూడా కేసీఆర్ నేతలకు సూచించారు. పార్టీలోకి కొత్త రక్తాన్ని ఆహ్వానిస్తూ, యువకులకు కీలక పదవులు ఇవ్వాలని కూడా నిర్ణయించారని సమాచారం. కాంగ్రెస్ సర్కారు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా చాలా అంశాలు స్పష్టతకు వస్తాయని, ప్రజల్లోకి వెళ్లి వాటిపై స్పందిస్తే బాగుంటుందని కేసీఆర్ చెప్పారు. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తవుతుండటంతో, ఆ సమయంలో కేసీఆర్ ప్రజల్లోకి వ్యూహాత్మకంగా వెళ్లే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

హరీశ్‌రావు ఆగ్రహం

దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల నుంచి టీజీఎస్‌ఆర్టీసీ.. అధిక చార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. ఆర్టీసీ టికెట్‌ ధరలను పెంచిందని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్‌ చార్జీలు పెంచి ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజా పాలనా.. సీఎం గారు.. ?’ అని ప్రశ్నించారు.

Tags

Next Story