BRS PROTEST: బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

‘కాళేశ్వరం’పై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో ఇవాళ ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల, జిల్లా కేంద్రాల్లో నేడు వివిధ రూపాల్లో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు ధర్నాలు, రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు అంటూ వివిధ రూపాల్లో నిరసనలకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం పైన కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నారు" అని కేటీఆర్ మండిపడ్డారు.
బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను సమర్ధంగా తిప్పి కొట్టాలని అన్నారు. ఇది కేసీఆర్పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదు.. తెలంగాణ నదీ జలాలను ఒక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగమేనని పేర్కొన్నారు. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమేనని అన్నారు. నిన్నటి దాకా సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చాడని ప్రశ్నించారు. రేవంత్ తీరును ప్రశ్నించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వానికి చేతకాదని తెలుసు: ఈటల రాజేందర్
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణను సీబీఐకి అప్పగించడంపై బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ‘మంచి పని చేశారు. వాళ్లకి చేత కాదని తెలుసు. వాళ్ల రిపోర్టు తప్పుల తడక అని తెలుసు.. వాళ్ల రిపోర్టు నిలవదు అనేది వాళ్లకు అర్థమైంది కాబట్టి డిస్ ఓన్ చేసుకోవడానికి ఈ పని చేశారు’ అని అన్నారు. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ సంపూర్ణంగా ఎంక్వయిరీ చేస్తుందని నమ్మకముందని తెలిపారు. కాళేశ్వరంపై జరిగిన అక్రమాలను బయటపెడుతుందని సంపూర్ణ విశ్వాసం మాకు ఉందని క్లారిటీ ఇచ్చారు. సీబీఐ సమగ్ర విచారణతో తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని.. తాము పూర్తిగా సహకరిస్తామని ఈటల తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com