BRS: బీఆర్ఎస్ రోడ్ షోలో రప్ప రప్ప పోస్టర్లు

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక దగ్గరపడటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో జోష్ మరింత పెంచాయి. అటు సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో బిజీగా ఉండగా బీఆర్ఎస్ నుండి కేటీఆర్, హరీష్ రావు సహా ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఈక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ రోడ్ షోలో రప్పా రప్పా 2028 పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. పుష్ప సినిమాలోని రప్ప రప్ప డైలాగ్ పోస్టర్‌ను ఓ వ్యక్తి ప్రదర్శించగా అందులో బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి పేరు ఉంది. అంతేకాకుండా కేసీఆర్ మరియు కేటీఆర్ ఫోటోలు ఉన్నాయి. అయితే అప్పట్లో వైసీపీ ఇలాంటి పోస్టర్లనే ప్రదర్శించడంతో ఏపీలో దుమారం రేగింది. సినిమాలోని డైలాగులో రప్పా రప్పా నరుకుతాం.. అని ఉంటుంది. దీంతో వైసీపీ ఈ డైలాగును వాడటంతో టీడీపీ విమర్శలు కురిపించింది.
"కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వట్లే"
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టిస్తున్న ఈ ఫార్మాలా కేసు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయాలన్నా, ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయాలన్నా.. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ విచారణకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చినా.. చార్జిషీట్‌కు మాత్రం ఇంకా ఆమోదం లభించలేదన్నారు. 2018లో ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్’ కు చేసిన సవరణల గురించి ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా, ఆ తర్వాత చార్జిషీట్ వేయాలన్నా.. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి గవర్నర్ ఆమోదం కోరగా… గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు. విచారణలో నిర్దిష్టమైన ఆధారాలు లభించాయని, దాని ఆధారంగా చార్జిషీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ ఆమోదం కోసం పంపించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
"కాంగ్రెస్‌ది అధికార దుర్వినియోగం"
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతో కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోందని బీఆర్ఎస్ నేత కేఆర్ సురేశ్ రెడ్డి ఆరోపించారు. అందుకే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొనాలంటే కేంద్ర బలగాలను పంపించాలని ఈసీని కోరామని, దీనికి ఈసీ కూడా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

