ED: నేడు ఈడీ విచారణకు కేటీఆర్

ED: నేడు ఈడీ విచారణకు కేటీఆర్
X
ఫార్ములా ఈ కారు రేసుపై విచారించనున్న ఈడీ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ

ఫార్ములా-ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ నేడు ఈడీ అధికారుల విచారణకు హాజరుకానున్నారు. ఈ నెల 7నే విచారణకు హాజరుకావాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో గడువు కోరడంతో నేడు రావాలని ఈడీ నోటిసులిచ్చింది. దీంతో నేడు ఉదయం 10.30 గంటలకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి కేటీఆర్‌ చేరుకుంటారు. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది.

ఈడీ విచారణపై స్పందించిన కేటీఆర్

ఫార్ములా ఈ - కార్‌ రేసు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరు కానున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. ఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్‌ తన న్యాయవాదులతో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కేటీఆర్ వాదిస్తున్నారు.

కేటీఆర్ మెడకు "రేస్" కేసు

ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు చిక్కులు తప్పలే కనిపించడం లేదు. ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కేటీఆర్ కు చుక్కెదురైంది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు తదుపరి కార్యాచరణకు దిగే అవకాశముంది.

క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కేటీఆర్

సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మాజీ మంత్రి కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. ఫార్మూలా ఈ కార్ రేస్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేటీఆర్.. సుప్రీంలో సవాల్ చేశారు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు వినింది. హైకోర్టు ఆదేశాలలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు కేటీఆర్ తరఫు న్యాయవాదులు తెలిపారు.

Tags

Next Story