KTR: గుడ్‌లక్‌.. చట్టపరంగా ఎదుర్కొంటాం

KTR: గుడ్‌లక్‌.. చట్టపరంగా ఎదుర్కొంటాం
X
ఫార్ములా ఈ రేస్ కార్ల వ్యవహారంపై కేటీఆర్... విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్‌

ఫార్ములా ఈ రేస్ కార్ల వ్యవహారంలో రూ. 50 కోట్ల గోల్ మాల్ ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదుకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో ఈ కార్ రేసు పేరుతో జరిగిన దోపిడీపై చర్చ జరిగిందని మంత్రి పొంగులేటి చెప్పారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ గవర్నర్ ఇచ్చిన అనుమతిని ఏసీబీకి పంపుతారని అన్నారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ ను అరెస్టు చేస్తారా లేదా అన్నది తానేమీ చెప్పలేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ‘ఫార్ములా-ఈ’ కారు రేసింగ్ కేసులో తనను అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'బీజేపీతో ఢిల్లీ చిట్టి గారి కాళ్ల బేరాలు, జైపూర్‌లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుంది. ముప్పైసార్లు ఢిల్లీకి పోయినా 3 పైసలు తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే మీ ఖర్మ. గుడ్ లక్.. చట్టపరంగా కేసులను ఎదుర్కొంటాం.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్

ఫార్ములా ఈ రేస్ కార్ల ఎలాంటి విచారణకైనా సిద్దమని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకే ఈ కారు రేసింగ్ నిర్వహించామని కేటీఆర్ అన్నారు. అధికారులకు సంబంధం లేదని.. పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు. కొన్నాళ్ళు జైలులో ఉంటే ఏమవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. జైల్లో యోగా చేసుకుని ఫిట్‌గా అయివస్తానని కేటీఆర్ గతంలో అన్నారు. జైలు నుంచి వచ్చాక పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునందుకే కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇంకోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజల్లోకి తీసుకువెళతామని కారు పార్టీ నేతలు పేర్కొన్నారు.

చట్ట ప్రకారం ముందుకు..

ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్‌ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించారు.. నేడో రేపో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది.. ఈ మేరకు క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది.ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్‌ అనుమతి ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు.

Tags

Next Story