KTR: రేవంత్ ది నరంలేని నాలుక

KTR: రేవంత్ ది నరంలేని నాలుక
X
తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. గారడీ మాటలు ఇంకెంత కాలమని సూటి ప్రశ్న

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి‌ది నరం లేని నాలుకని.. ఏదైనా మాట్లాడుతుందని విమర్శించారు. అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రజా వ్యతిరేక చర్యలను ఖండిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అబద్దాలతో కాపురం

రేవంత్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసం అని స్పష్టంగా వెల్లడించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద రేవంత్ ప్రకటనలు చేయలేదా అని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా అని నిలదీశారు. ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా అని అడిగారు. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారని ప్రశ్నించారు. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్ధాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగానే పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన నరేందర్‌ రెడ్డి జైల్లో ఉన్నారని అన్నారు. నరేందర్‌ రెడ్డి కోరిక మేరకు జైలు పాలైన 30మంది రైతులకు అండగా ఉంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే...

కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని చెప్పారు. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా అన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags

Next Story