BYPOLL: ఉప ఎన్నిక పోరు.. ప్రచార హోరు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి తరపున కేటీఆర్), బీజేపీ అభ్యర్థి తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. పాదయాత్రల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు, మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరును మరింత పెంచాయి.
ప్రధాన పార్టీలకు సవాల్….!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ విజయం ఎంతో అవసరమన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కానీ సీన్ రివర్స్ అయితే... ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సంకేతాలు మరింత బలపడుతాయి. ఈ పరిణామం కాస్త ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు మరింత లాభం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ఈ ఉపఎన్నిక రెఫరెండంగానే భావించవచ్చన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఉప ఎన్నికలో గెలవలేకపోతే అది ఆ పార్టీపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ గెలిచి నగరంలో పట్టు పెంచుకోవటంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సరైన బదులివ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ తో పాటు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇవ్వాలని… నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చూసి చూపిస్తామని కోరుతున్నారు.
బరిలోకి దిగిన అగ్ర నేతలు
మూడు పార్టీల తరఫున అగ్రనేతలు ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రంగంలోకి దిగి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులు రోడ్ షోలు, రెండు రోజులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రతి డివిజన్ ప్రచార బాధ్యతలను ఇద్దరేసి మంత్రులకు అప్పగించారు. ప్రతి 10 పోలింగ్ కేంద్రాల బాధ్యతను ఓ ఎమ్మెల్యేకు ఇచ్చారు. వందేసిమంది ఓటర్లను కలవాలని స్థానిక నేతలకు నిర్దేశించారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా సీఎం ప్రచారం నిర్వహిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి తరఫున కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పితృ వియోగం వల్ల మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచారానికి దూరం అయ్యారు. భాజపా తరఫున కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు.
కేటీఆర్ రోడ్ షోలు….
ఇక్కడ సీటు గెలవటమనేది బీఆర్ఎస్ కు అత్యంత ముఖ్యంగా మారిపోయింది. ఇది వారి సిట్టింగ్ స్థానం. వరుసగా ఇక్కడ విజయాలు సాధించిన బీఆర్ఎస్... ఈ ఉపఎన్నికలో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఓవైపు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ గెలిస్తేనే... అధికార కాంగ్రెస్ పై మరింత పోరాడేందుకు స్కోప్ దొరికే అవకాశం స్పష్టంగా ఉంటుంది.
వేగం పెంచిన బీజేపీ…!
బీజేపీ కూడా ప్రచారంలో వేగం పెంచింది. కాలనీల్లో ఓటర్ల ఇంటికి పాదయాత్రగా వెళుతోంది. కార్పెట్ బాంబింగ్ అంటూ కొత్త తరహా ప్రచారానికి తెరతీసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. పార్టీలోని కీలక నేతలంతా కూడా ప్రచారంలో ఉంటున్నారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని… కాంగ్రెస్ కూడా విఫలమైందని కమలం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

