BYPOLL: నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేడు విడుదలకానుంది. ఎన్నికల సంఘం నేడు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈరోజు ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ 21వ తేదీ వరకు కొనసాగనుంది. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. . జూబ్లీహిల్స్‌లో మొత్తం 4 లక్షల ఓటర్లు ఉన్నారని.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన ఐడీ కార్డులతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆర్ వి కర్ణన్ స్పష్టం చేశారు. 2025, నవంబర్ 14న యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఎన్నికకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిపడా ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయని.. ఫస్ట్ లెవెల్ ఈవీఎం చెకింగ్ కూడా పూర్తయిందని వెల్లడించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ తప్పకుండా పాటించాలని.. మీడియా కూడా ఎలాంటి ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు. అభ్యర్థులు తప్పకుండా తమపై ఉన్న కేసుల వివరాలను న్యూస్ పేపర్లు, న్యూస్ చానెల్స్‌లో పబ్లిష్ చేయాలని సూచించారు. సికింద్రాబాద్ ఆర్డిఓ సాయిరాం రిటర్నింగ్ అధికారిగా నామినేషన్లు స్వీకరించనున్నారు. వచ్చేనెల 11 ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. పోలింగ్ అనంతరం 14వ తేదీన ఓట్ల కౌంటింగ్ చేయనున్నారు.
అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికను తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ, జనసేన పార్టీలు ట్రయల్ గా ఉపయోగించుకుంటున్నాయి. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, భారత రాష్ట్ర సమితి తరఫున సునీత బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఇంకా ఖరారవ్వలేదు. ఢిల్లీలో ఎంపిక జరగనుంది. బీజేపీ అభ్యర్థి కూడా ఖరారైన తర్వాత ఒక్కసారిగా రాజకీయం వేడెక్కే అవకాశం ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా తొలగించకుండా అలాగే ఉంచితే మొన్నటి ఎన్నికల్లోనే ఆ పార్టీ అధికారం చేపట్టడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ బీజేపీ వారే తమ పార్టీని చంపేసుకున్నారు. దీనివెనక అనేక రాజకీయ కారణాలున్నాయి. ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. టీడీపీ-జనసేన ఎంపీలు కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చారు. వీరి మద్దతే కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఇలాగే కూటమిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగిద్దామని ఈ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ఈ పార్టీలు సత్తా చాటితే భవిష్యత్తు రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com