BYPOLL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. సాయంత్రం ఆరు గంటల కల్లా పోలింగ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక ఓటరూ ఓటును వినియోగించుకోనున్నారు. క్యూ లో ఎంత మంది ఉన్నా, ఎంత సమయం పట్టినా, అందరూ ఓట్లు వేసిన తర్వాతే పోలింగ్ ప్రక్రియ ముగించి, ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి, రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు తరలించనున్నారు. ఉప ఎన్నిక, జనరల్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని ఎన్నికల సంఘం సూచించింది. గంట పాటు పోలింగ్ సమయాన్ని పెంచడం పై పోలింగ్ శాతం గతంలో కంటే పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు 14న వెలువడనున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా.. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్‌యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 58 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 4,01,365 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఉపఎన్నిక కోసం 407 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 226 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 139 డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. 1761 మంది పోలీసులు, కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. పోలింగ్ కేంద్రాల్లో పనిచేయనున్న 2,060 మంది పీఓ, ఏపీఓ, ఓపీలకు పోలింగ్ కేంద్రాల కేటాయింపు జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రం యూసుఫ్‌గూడ కోట్ల విజయవిజయభాస్కర్రెడ్డి స్టేడియం వద్ద సీఐఎస్ఎఫ్ దళాలు వెలుపల, లోపల బెటాలియన్ పోలీసులు, స్థానిక పోలీసులు మూడంచెల్లో భద్రత కల్పిస్తామని జాయింట్ సీపీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

