BYPOLL: జోరందుకోనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
* నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 13
* నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 21
* నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 22
* నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 24
* పోలింగ్ తేదీ: నవంబర్ 11
* ఓట్ల లెక్కింపు : నవంబర్ 14
జోరందుకోనున్న ప్రచారం
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో అన్ని పార్టీలు ప్రచారం గేర్ మార్చాయి. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలని బీఆర్ఎస్.. ఈ సీటు గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నాయి. షెడ్యూల్ రావడంతో జూబ్లీహిల్స్ లో ప్రచారం జోరు మరింత పెరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించిన బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. . లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com