BYPOLL:దొంగ ఓట్ల చుట్టూ తిరుగుతున్న "జూబ్లీ" రాజకీయం

తెలంగాణలోని పార్టీల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ కాకకు కారణమవుతోంది. దొంగ ఓట్లు అంటూ బీఆర్ఎస్ చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో రాజకీయం చేస్తోందని గులాబీ నేతలు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ భగ్గుమంది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలోనే దొంగ ఓట్లు పుట్టుకొచ్చాయని బీజేపీ విమర్శిస్తోంది.
జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లు
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయరని కాంగ్రె్‌సకు అర్థమైంది. మనల్ని ఓడించాలనే కాంగ్రెస్ ఒక్క ఇంట్లోనే 43 దొంగ ఓట్లు నమోదు చేయించింది. ఇలా వేల ఓట్లు చేర్చింది. జూబ్లీహిల్స్‌లో కొట్టే దెబ్బకు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం అదిరిపడాల’ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రహమత్‌నగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లో 400 పోలింగ్ కేంద్రాల పరిధిలో 50-100 చొప్పున మొత్తం 20 వేల దొంగ ఓట్లను నమోదు చేయించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ గురించి, రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్ ప్రజలకు బాగా తెలుసని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని వ్యాఖ్యానించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కారుకు, బుల్డోజరుకు మధ్య జరుగుతోందని, ఎన్నిక తర్వాత మీ ఇంటికి కారు రావాలా, బుల్డోజరు రావాలా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు.
బీఆర్ఎస్ కొత్త నాటకం:మంత్రి వివేక్
దొంగ ఓట్లు అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లే ఇప్పుడు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పేందుకు ఏమీ లేకపోవడంతోనే దొంగ ఓట్లు అంటూ బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. ‘‘జూబ్లీహిల్స్‌లో ఏవో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నది. ఓటర్ లిస్టులను కాంగ్రెస్ తయారు చేయదు. ఈసీ తయారు చేస్తుంది. గతంలో ఉన్న ఆ 43 ఓట్లు ఇప్పుడూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కొత్తగా ఆ ఓట్లు రాలేదు. దీనిపై ఈసీ స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తున్నది. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే. కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకే. అయినా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ మాటలను నమ్మే పరిస్థితి లేదు. గత పదేళ్లుగా ఆ పార్టీని నమ్మి మోసపోయామనే ...గత అసెంబ్లీ ఎన్నికల్లో జనం కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు” అని పేర్కొన్నారు.
దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్.. ఎంపీ
జూబ్లీహిల్స్‌లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ అనటం హాస్యాస్పదమని ఎంపీ అర్వింద్ అన్నారు. తెలంగాణలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో అపార్టుమెంట్లో 43 ఓట్లు దొంగ ఓట్లైతే, బోధన్‌లో బీఆర్ఎస్ హయాంలో 42 దొంగ పాస్‌పోర్టులు ఇచ్చిన సంగతి మరిచారా అంటూ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్థులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్, మత్తు పదార్థాల దందాకు తెరలేపింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ క్లబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేసింది కేటీఆర్ అని మండిపడ్డారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఎంపీ విమర్శించారు. 42 శాతం అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగా చేయలేదన్నారు. ఈ అంశంలో బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com