Hyderabad: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్‌పై దాడి కేసులో బయటికొస్తున్న నిజాలు..

Hyderabad: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్‌పై దాడి కేసులో బయటికొస్తున్న నిజాలు..
Hyderabad: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ పై దాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి.

Hyderabad: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ పై దాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. క్యాబ్ బుక్ చేసుకున్న వివేక్ రెడ్డి అనే వ్యక్తి... డబ్బులు ఎగ్గొట్టి వెళ్లేందుకు యత్నించాడు. అదేంటని అడిగిన క్యాబ్ డ్రైవర్ పైనే దాడికి దిగాడు. దాంతో ఆ క్యాబ్ డ్రైవర్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఈఘటన గతనెల 31న రాత్రి జరిగింది.ఈకేసులో నిందితుడికి పోలీసులు సహకరించారనే ఆరోపణలున్నాయి. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.

ఉప్పర్‌పల్లికి చెందిన వివేక్‌రెడ్డి గతనెల 31న రాత్రి బీఎన్‌రెడ్డినగర్‌ నుంచి ఉప్పర్‌పల్లికి కారు బుక్‌ చేసుకున్నాడు. నారాయణ్‌ఖేడ్‌కు చెందిన వెంకటేష్‌ కారు డ్రైవర్‌. అతడు కారుతో వివేక్‌ ఉన్నచోటికి చేరుకున్నాడు. మధ్యలో కారు ఓనర్ పర్వతాలు కూడా వెహికల్లో ఎక్కాడు. ఉప్పర్‌పల్లి చేరాక.. మద్యం మత్తులో ఉన్న వివేక్‌రెడ్డి 600 రూపాయి కిరాయి ఇవ్వకుండా కారు దిగి వెళ్లిపోబోయాడు.

డబ్బు అడగ్గా గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా స్నేహితులను పిలిపించాడు. వాళ్లో 20 మంది వచ్చి క్యాబ్ డ్రైవర్ ను, యజమానిని చితకబాదారు. డబ్బు ఇవ్వకున్నా ఫర్వాలేదంటూ కాళ్లావేళ్లా పడ్డా కనికరంచలేదు. క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా కొట్టారు. పెట్రోలింగ్‌ వాహనంలో వచ్చిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. నిందితులు వారిముందే దాడి చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

క్యాబ్ డ్రైవర్ వెంకటేష్‌, ఓనర్ పర్వతాలే తమపై దాడి చేసి, బంగారు గొలుసు కొట్టేశారంటూ నిందితులు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్‌ పీఎస్ లో సైతం ఫిర్యాదు చేశారు. దాంతో బాధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించకుండా మర్నాడు ఉదయం వరకూ పీఎస్ లోనే కూర్చోబెట్టారు. వెంకటేష్‌ వాంతులు చేసుకొని కుప్పకూలాడు. దీంతో బంధువులకు సమాచారం ఇచ్చి వారిని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

కానీ అప్పటికే వెంకటేష్‌ పరిస్థితి విషమించడంతో అతను కోమాలోకి వెళ్లాడు. దాంతో అక్కడ్నుంచి వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఏడు రోజులుగా వెంకటేష్‌ కోమాలోనే ఉన్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్ ఓనర్ పర్వతాలు కోలుకుంటున్నట్టు చెప్పారు. వివేక్‌రెడ్డి అతడి స్నేహితులపై మొదట సెక్షన్‌ 324 కింద.. రెండు రోజుల తర్వాత సెక్షన్‌ 307 కేసు నమోదు చేశారు పోలీసులు.

వివేక్‌రెడ్డి న్యాయస్థానంలో లొంగిపోగా కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితులను తప్పించేందుకు ఓ కానిస్టేబుల్‌ సహకరించారనే ఆరోపణలున్నాయి. పోలీసులు సహకరించినట్లు నిర్ధారణ అయితే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రాజేంద్రనగర్‌ సీఐ నాగేంద్రబాబును వివరణ కోరగా.. పోలీసుల ముందు దాడిచేశారనేది అబద్ధమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story