Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం.. 46మందిపై కేసు నమోదు..

Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. 17వ తేదీనజరిగిన హింసాత్మక ఘటనలో ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు. దాడులు చేసిన వాళ్లలో 200 మందిని గుర్తించారు. దాడిలో పాల్గొన్న విగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరా, వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంత మంది అభ్యర్థులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన హింసాత్మక సంఘటలపై రైల్వే ఎస్పీ అనురాధ వివరాలు వెల్లడించారు.
17వ తేదీన ఉదయం 8గంటలకు 300మంది ఈస్ట్ కోస్ట్ దనపుర్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారన్నారు. ఈ విధ్వంసంలో మొత్తం 30 రైల్వేకోచ్‌లు ధ్వంసం అయ్యాయన్నారు. 46మందిపై కేసునమోదుచేశామని.. వీరికి జీవిత కాలం శిక్షపడే అవకాశం ఉందన్నారు. ఇందులో పాల్గొన్న 2వేల మంది ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కోసం చూస్తున్నవారేనని స్పష్టం చేశారు. వీరు వాట్సాప్ గ్రూపులద్వారా వీళ్లకు కోచింగ్ ఇస్తున్న సెంటర్లు తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టాయని ఎస్పీ వెల్లడించారు. రైల్వే స్టేషన్ బ్లాక్ గ్రూప్, హకీంపేట్ ఆర్మీగ్రూప్, సోల్జర్స్ డై గ్రూప్‌లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
లోకో ఇంజన్ లో 4వేల లీటర్ల ఆయిల్ ఉందని.. అది పేలిఉంటే భారీ ప్రమాదంజరిగేదన్నారు. అందుకోసమే ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. సికింద్రాబాద్‌లో జరిగిన హింసలో దాదాపు 12 కోట్లపైగా ఆస్తినష్టంజరిగినట్లు ఎస్పీ తెలిపారు. ఈ విధ్వంసంలో పాల్గొన్నవారిక మీద కేసునమోదు అయితే రైల్వే యాక్ట్ ప్రకారం వారికి ప్రభుత్వ ఉద్యోగం రాదని ఆమె వెల్లడించారు. ఈ ఘటనలో 9మంది రైల్వే స్టాప్ కూడా గాయపడినట్లు వెల్లడించారు. ఈ కేసులను హైదరాబాద్ పోలీసులకు ట్రాన్ప్ ఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనతో మొత్తం మూడు రాష్ట్రాల్లోని ఆర్మీ కోచింగ్ సెంటర్లపై పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణ, ఏపీ, బీహార్‌లోని కోచింగ్ సెంటర్ల నుంచే కుట్ర జరిగిందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌కు వ్యతిరేకంగా యువతను ఎవరు రెచ్చగొట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహకుడు సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో సుబ్బారావు పాత్ర ఉందని పోలీసులు నిర్థారణకు వచ్చారు.
కేంద్రం ప్రభుత్వ ఆస్తులు, రైల్వేస్టేషన్లను ధ్వంసం చేయడం ద్వారా అగ్నిపథ్‌ను అడ్డుకోవచ్చని ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. సుబ్బారావు యువతను రెచ్చగొట్టేలా వాట్సప్ గ్రూప్‌లలో మెసేజ్‌లు పంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ ఘటన వెనక, ఆ తర్వాతి విధ్వంసానికి లక్ష్యంగా చేసుకున్న గుంటూరు, విజయవాడ రైల్వేస్టేషన్లకు యువకులు చేరుకునేలా సుబ్బారావు క్రియాశీలకంగా వ్యవహరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా కుంభం మండలం తురిమెళ్లకు చెందిన ఆవుల సుబ్బారావు.. ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్‌గా చేరి అధికారి హోదాలో పనిచేసి 2012లో రిటైర్డ్ అయ్యారు. 2014లో నరసరావుపేటలో రావిపాడు రోడ్‌లో సాయిడిఫెన్స్ అకాడమీని ప్రారంభించారు.
గుంటూరు, ప్రకాశం, కర్నూలు అనంతపురం జిల్లాలకు చెందిన యువకులు ఎక్కువగా అక్కడ శిక్షణ తీసుకుంటునట్లు తెలుస్తోంది. దీనితో పాటు మరో తొమ్మిది అకాడమీలను కూడా సుబ్బారావు ప్రారంభించారు. మరోవైపు అగ్నిపథ్ విధ్వంసం నేపథ్యంలో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు.. వాట్సప్ గ్రూప్ ద్వారా నిరసనలకు ప్లాన్ చేస్తున్న కర్నూలుకు చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com