PHONE TAPPING: డీఎస్పీ ప్రణీత్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

PHONE TAPPING: డీఎస్పీ ప్రణీత్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసు నమోదు... పోలీసు శాఖ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ

తెలంగాణలో స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌ DSP కాల్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. రాజకీయాల్లోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సస్పెన్షన్‌లో ఉన్న SIB.. DSP ప్రణీత్‌ రావు సహా మరికొందరిపై ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌లో DSPగా పనిచేసిన ప్రణీత్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీగా పనిచేసిన సమయంలో పంజాగుట్టలోని SIB కార్యాలయంలో ఉన్న రెండు గదులను వినియోగించుకుంటూ అనధికారికంగా అతని బృందంతో 17 కంప్యూటర్లను వాడుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి కొందరు వ్యక్తుల పేరిట ప్రొఫైల్‌లు తయారుచేశారు. అదే సమయంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్‌ కాల్స్ ట్యాపింగ్‌ చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.


గతేడాది డిసెంబర్ 4వ తేదీ రాత్రి CCTVలు ఆఫ్‌చేసి, డేటానంతా వ్యక్తిగత పెన్‌డ్రైవ్‌, హార్డ్‌డిస్క్‌లలో కాపీ చేసుకున్న ప్రణీత్ అనంతరం కంప్యూటర్‌లో ఉన్న డేటా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. కంప్యూటర్‌కు సంబంధించిన 42 హార్డ్‌డిస్కులను మాయం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. CDR, IMEI నంబర్లు, ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ డేటా చెరిపేసి, అదే రోజు అర్ధరాత్రి ఎలక్ట్రిషియన్‌ సాయంతో సీసీటీవీ కెమెరాలు ఆఫ్‌చేసి వ్యవహారమంతా నడిపించినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజే ప్రణీత్‌రావు ఈ చర్యలకు పాల్పడినట్లు అర్థమవుతోంది. కాగా, దీనిపై SIBఅదనపు SP రమేశ్.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణీత్‌రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రణీత్‌రావు సహా ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల న్యాయవాది అరుణ్‌కుమార్‌..ప్రణీత్‌రావుపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసులో భాగంగా ప్రణీత్‌రావుతోపాటు మరికొందరు అని FIRలో నమోదు చేశారు. కానీ, వారు ఎవరు..? ఎంతమంది ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రణీత్‌రావు పైఅధికారులా..? లేక అతని వద్ద పనిచేసిన సిబ్బందా..? అనే విషయం తేలాల్సి ఉంది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ప్రణీత్ రావును.. రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story