Vanasthalipuram: బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసు అప్డేట్.. కోర్టులో లొంగిపోయిన క్యాషియర్..

Vanasthalipuram: హైదరాబాద్‌లోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. బ్యాంకులో 22.53 లక్షలు చోరీకి గురైన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్యాషియర్ ప్రవీణ్ కోర్టులో లొంగిపోయారు. చోరీ జరిగిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోవడంతో క్యాషియర్ ప్రవీణే డబ్బు దొంగిలించాడని తేలింది. దీంతో వారం రోజుల నుంచి పోలీసులకు చిక్కకుండా నేరుగా కోర్టులో లొంగిపోయాడు.
అతనికి కోర్టు ఈనెల 30 వరకు రిమాండ్ విధించింది. మొదట వారణాసిలో ఉన్నానంటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు ప్రవీణ్. ఇన్‌స్టా చాట్ ఆధారంగా ప్రవీణ్ గోవాలో ఉన్నట్లు గుర్తించారు. అయితే.. తాను వారణాసి, గోవా వెళ్లలేదన్నారు ప్రవీణ్. హైదరాబాద్ నుంచి నేరుగా నల్గొండ జిల్లా చిట్యాలకు వెళ్లానని.. అక్కడ బైక్ వదిలేసి బస్సులో జడ్చర్లకు వెళ్లానన్నారు. అటు నుంచి బెంగళూరు వెళ్లానని చెప్పాడు.
అక్కడ ఇతరుల ఫోన్ తీసుకొని ఇన్‌స్టాలో సెల్ఫీ వీడియో పెట్టానన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. తనపై వచ్చిన కథనాలతో చచ్చిపోవాలనిపిస్తోందన్నారు. అజ్ఞాతంలో ఉన్న సమయంలో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు ప్రవీణ్. బ్యాంకు నుండి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ సెల్ఫీ వీడియో పంపాడు. బ్యాంకులో నగదు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును.. తనపై పడేస్తున్నారని ఆరోపించాడు. బ్యాంకు మేనేజర్, సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com