Caste Census: కుల గణనకు రేవంత్ సర్కార్ సిద్ధం

Caste Census: కుల గణనకు రేవంత్ సర్కార్ సిద్ధం
X
54 ప్రశ్నలతో ప్రశ్నావళి... నవంబర్ ఆరు నుంచి ప్రారంభించేందుకు సిద్ధం

తెలంగాణలో కులగణనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల 6 నుంచి దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 15 నుంచి 20 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయనుంది. ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే’ పేరుతో చేపట్టే కులగణన కోసం మొత్తం 54 ప్రశ్నలతో ప్రశ్నావళి ఉండే అవకాశం ఉంది. ఈ ప్రశ్నావళి సాయంతోనే ఇంటింటికి వెళ్లి వివరాలను సిబ్బంది సేకరించనున్నారు. తెలంగాణలోని ప్రతి ఇంట్లో కుటుంబసభ్యుల వ్యక్తిగత వివరాలతో పాటు వారి కులం, ఉప కులం, చదువు, చేస్తున్న ఉద్యోగం, వస్తున్న ఆదాయం, చేసిన అప్పులు, ఉంటున్న ఇల్లు, పొలం, బైకో, కారో ఉంటే ఆ వివరాలు.. ఇట్ల ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరిస్తారు. కుటుంబ రాజకీయ ప్రస్తానం గురించీ ఆరా తీయనున్నారు. కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధిగా పనిచేశారా? ఎంత కాలం చేశారు ? నామినేటేడ్​ పదవులు ఏమైనా పొందారా? లాంటి వివరాలు కూడా తెలుసుకోనున్నారు. ఈ మేరకు ప్లానింగ్​ డిపార్ట్​మెంట్​ క్వశ్చనీర్​ రెడీ చేసింది.

భట్టి విక్రమార్క సమీక్ష

కులగణనతో దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక మోడల్‌గా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో సమావేశమై కులగణనలో చేయాల్సిన మార్పు చేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు జరిపారు. ప్రజల నుంచి సమాచారం తీసుకునేందుకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తే బాగుంటుందని వారిని సలహాలు అడిగారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయ వాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సందేశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పాత కమిషన్‌ కాలం ముగిసిన వారంలోపే కొత్త బీసీ కమిషన్‌ వేశామని, బీసీ సంక్షేమం, అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోజుకు ఒక ఎన్యుమరేటర్‌ 15 ఇళ్లలో సర్వే చేయడం భారమవుతున్న నేపథ్యంలో ఆ సంఖ్యను పదికి కుదించాలని విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళీ సూచించారు. ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్‌ సింహాద్రి, సామాజిక విశ్లేషకుడు పాశం యాదగిరి పాల్గొన్నారు.

కులగణన ప్రక్రియ వేగవంతం: భట్టి

కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు కులగణన ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలిపారు. కులగణనలో తెలంగాణ ఒక మోడల్ కానుందన్న భట్టి.. ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం పట్టం కడుతుందన్నారు. కులగణనపై సామాజిక వేత్తలు, మేధావులతో రాష్ట్ర సచివాలయంలో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.

Tags

Next Story