CBI: మళ్లీ తెలంగాణలోకి సీబీఐ

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. తెలంగాణలోకి సీబీఐ రాకపై నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. తెలంగాణ గడ్డపై సీబీఐని అడుగుపెట్టనివ్వకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకట్ట వేస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సీబీఐకి ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. సీబీఐ, ఈడీ బీజేపీ జేబు సంస్థలు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధే కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతున్నదో అనేది ఉత్కంఠ రేపుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీబీఐ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఇక తెలంగాణలోనూ సీబీఐ విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న సమయంలో నాటి కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుకు అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు నాడు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో 51 జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఏ కేసులోనైనా దర్యాప్తు కోసం సీబీఐ తెలంగాణలోకి ప్రవేశించానికి వీలు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఏ కేసునైనా విచారణ జరపాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సీబీఐని అనుమతించకుండా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. అయితే ఏదైనా కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశిస్తే రాష్ట్రాలు అనుమతి ఇవ్వకపోయినా సీబీఐకి విచారణ జరిపే అధికారం ఉంది. అప్పటినుంచి ఆ జీవో కొనసాగుతోంది. తాజాగా ఈ జీవోను ఎత్తివేసి కాళేస్వరం కేసును రేవంత్ సర్కారు సీబీఐకి అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com