Viveka Murder Case: వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరిన సీబీఐ

Viveka Murder Case: వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరిన సీబీఐ
దస్తగిరి వాదనను సమర్థిస్తున్నాం - తెలంగాణ హైకోర్టుకు తెలిపిన సీబీఐ

వివేకా హత్య కేసులో వైకాపా MP వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును CBI కోరింది. కోర్టు విధించిన బెయిల్ షరతులను అవినాష్ ఉల్లంఘించారని దర్యాప్తు సంస్థ తెలిపింది. దస్తగిరి, ఇతర సాక్షులను బెదిరింపులు, ప్రలోభాల నుంచి కాపాడాలంటే న్యాయస్థానం జోక్యం చేసుకొని అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. తనతోపాటు కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నందున అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి కోరగా... ఆ వాదనను సమర్థిస్తున్నట్లు సీబీఐ పేర్కొంది.

వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్ పై CBI కౌంటరు దాఖలు చేసింది. అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని తేల్చిచెప్పింది . హైకోర్టు విధించిన బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘించారని CBI స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి, ఇతర నిందితులు అత్యంత శక్తిమంతులని.. ఇప్పటికే పలువురు సాక్షులను ప్రభావితం చేశారని కౌంటరులో వివరించింది. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా, అప్రూవర్ గా దస్తగిరి అత్యంత కీలకమని స్పష్టం చేసింది. తన తండ్రిపై దాడి చేశారని.. కుటుంబ సభ్యులను బెదిరించారని దస్తగిరి చెబుతున్నారని పేర్కొంది. నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి 20 కోట్ల రూపాయల ఆశచూపి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని దస్తగిరి ఫిర్యాదు చేశారని కౌంటరులో దర్యాప్తు సంస్థ తెలిపింది. దస్తగిరి, ఇతర నిందితులను బెదిరింపులు, ప్రలోభాల నుంచి కాపాడాలంటే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ కోరింది.

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. దస్తగిరి తండ్రిపై దాడి జరిగిందని.. కుటుంబ సభ్యులను బెదిరించారన్నారు. కోర్టు షరతులను ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని కోరారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు అప్రూవర్ గా దస్తగిరికి ఉంటుందని.. పలు తీర్పులను ప్రస్తావించారు. దస్తగిరి వాదనతో ఏకీభవిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. అలాంటప్పుడు అవినాష్ బెయిల్ రద్దు చేయాలని ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని CBIని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. తమకన్నా ముందుగానే వైఎస్ సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని.. అదే పిటిషన్ లో తాము వాదనలు వినిపిస్తామని CBI న్యాయవాది తెలిపారు. సాక్షులకు బెదిరింపులు, ప్రలోభాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించగా.. దస్తగిరి ఫిర్యాదులను స్థానిక పోలీసులకు పంపించడంతో పాటు.. చట్టపరంగా పరిశీలిస్తున్నామని సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు.

బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు దస్తగిరికి లేదని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఒకవేళ బెదిరింపులు వస్తే సాక్షుల రక్షణ స్కీం కింద చర్యలు తీసుకోవచ్చునని.. దానికి అవినాష్ బెయిల్ కు సంబంధం లేదని వాదించారు. బెదిరింపుల నెపంతో గన్ మెన్ లతో తిరుగుతున్నారన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story