CBN: రెండేళ్లలో అమరావతి నుంచి క్వాంటం కంప్యూటర్లు

అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అట్టడుగు వర్గాల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పాలనలో పారదర్శకత, వేగం, బాధ్యతాయుత అమలే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ప్రత్యక్షంగా పాల్గొనగా… జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి భవిష్యత్ విజన్ వరకు అనేక కీలక అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాల అమలు పురోగతి, ఆదాయార్జన శాఖల పనితీరు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం విస్తృతంగా సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు ఫలితాలుగా మారుతున్నాయా లేదా అన్నదే ప్రధాన ప్రమాణంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా సాంకేతికత వినియోగం మరింత పెంచాలని సూచించారు. డేటా భద్రత, డేటా లీక్ నివారణ, పాలనలో ఏఐ టూల్స్ వినియోగంపై లోతైన చర్చ జరిగింది. గతంలో జిల్లా కలెక్టర్ల సదస్సులు నిర్వహించేవారు కాదని, ఇప్పుడు మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి నెల రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. నెలవారీగా అధికారులు పనితీరును సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్చార్జ్ మంత్రులు సమర్థంగా పనిచేయాలని స్పష్టం చేశారు. నిర్ణయంపై అధికారులు పట్టుదలతో పని చేయాలని, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో ఇన్చార్జ్ మంత్రులు పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
సూపర్ సిక్స్ పథకాల అమలుపై
సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘తల్లికి వందనం’ పథకం అమలులోకి తెచ్చామని, స్త్రీ శక్తి పథకం ద్వారా 4.29 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.6,310 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. దీపం పథకం కింద రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు అందించామని, ఎన్టీఆర్ భరోసా ద్వారా రూ.58,654 కోట్ల పెన్షన్లు పంపిణీ చేశామని వెల్లడించారు. రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రత్యేకంగా ఆడిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
