Telangana Debt: తెలంగాణకు కేంద్రం షాక్..! రూ.19వేల కోట్ల అప్పులకు బ్రేక్..

Telangana Debt: తెలంగాణకు కేంద్రం షాక్..! రూ.19వేల కోట్ల అప్పులకు బ్రేక్..
Telangana Debt: తెలంగాణ అప్పులపై కేంద్రం సీరియస్ అయింది. ఈ ఏడాది 19వేల కోట్ల రూపాయల అప్పులకు అడ్డుకట్ట వేసింది.

Telangana Debt: అప్పులపై తెలంగాణ ప్రభుత్వానికి షాకులు ఇస్తూనే ఉంది కేంద్రం. ఈ ఏడాది 19వేల కోట్ల రూపాయల అప్పులకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కోసం 52వేల 167 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. కాని, కేంద్రం మాత్రం దాదాపుగా 34వేల కోట్ల రూపాయల అప్పులకే అనుమతి ఇస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఆ 19వేల కోట్లు ఎలా అప్పుగా తెచ్చుకోవాలో తెలియక సందిగ్ధావస్థలో పడింది తెలంగాణ ప్రభుత్వం.


ముఖ్యంగా బడ్జెట్‌ వెలుపల రుణాలు తీసుకోవడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ఈ బడ్జెట్‌ వెలుపల రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చూపించకుండా దాదాపుగా అన్ని రాష్ట్రాలు రుణాలు తీసుకుంటున్నాయి. కాని, ఇలా తీసుకున్న అప్పులకు వడ్డీలు, అసలును బడ్జెట్‌ నుంచి కడుతున్నాయి. బడ్జెట్‌ వెలుపల రుణాలు తీసుకుని, తిరిగి బడ్జెట్‌ నుంచే చెల్లిస్తుండడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. గత రెండేళ్లుగా ఏ రాష్ట్రాలైతే ఇలా బడ్జెట్‌ బయట నుంచి అప్పులు తీసుకున్నాయో వాటినన్నంటినీ లెక్కించి.. ఈ ఏడాది తీసుకోవాలనుకున్న అప్పుల్లో కోత పెడతానని స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అభ్యంతరం చెబుతోంది. ఉన్నట్టుండి రెండేళ్ల అప్పులను సాకుగా చూపి, ఈ ఏడాది కోత పెట్టడమేంటని ప్రశ్నిస్తోంది. కాని, కేంద్రం మాత్రం తెలంగాణ మాట వినేందుకు ససేమిరా అంటోంది.


గత రెండేళ్లలో వివిధ కార్పొరేషన్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వం 57వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. కాళేశ్వరం, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, ఇళ్ల నిర్మాణం, హైదరాబాద్‌ జలమండలి, మున్సిపాలిటీల్లో ప్రాజెక్టులు, ఆర్టీసీ, రోడ్ల కోసం ఆయా కార్పొరేషన్ల ద్వారా తెలంగాణ అప్పులు తీసుకుంది. ఇలా రెండేళ్లుగా తీసుకున్న 57వేల కోట్ల అప్పులను మూడేళ్లకు విభజించింది. అంటే, ఏడాదికి 19వేల కోట్లన్న మాట. ఈ ఏడాది నుంచి వరుసగా మూడేళ్ల పాటు అప్పుగా తీసుకోవాలనుకున్న మొత్తం నుంచి ఏటా 19వేల కోట్లు కట్‌ చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది తెలంగాణకు 34వేల కోట్ల అప్పునకు మాత్రమే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో.. ఆదాయార్జనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. భూముల అమ్మకం, ఇతరత్రా మార్గాల ద్వారా రాబడి పెంచుకోవాలనుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story