Election Commission: తెలంగాణపై కేంద్ర ఎన్నికల బృందం ప్రత్యేక దృష్టి

నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మునుగోడు ఉపఎన్నిక అనుభవాల నేపథ్యంలో గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల నిర్వహణ, తనిఖీలు సహా ఎక్కడా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు హైదరాబాద్‌లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో విడిగా సమావేశమైన ఈసీ అధికారులు... ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకుంటున్న నగదు, కానుకలు, వస్తువల ధరను లెక్కగట్టి నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను ఆదేశించింది. ఇదే సమయంలో తగిన సాక్ష్యాలు ఉంటే పట్టుబడుతున్న నగదును వదిలిపెట్టాలని సూచించింది. ఎన్నికల దృష్ట్యా CCLA కమిషనర్ నవీన్ మిట్టల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని బదిలీ చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత అధికారి, ఆర్టీఐ కార్యకర్త ఎంఏ సత్యనారాయణరావు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. పదవీ విమరణ చేసిన ఐఏఎస్ అధికారులను మళ్లీ ప్రభుత్వ శాఖల్లో నియమించడం పూర్తి రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరులో వివిధ పార్టీల ముఖ్య కార్యకర్తలతో పరకాల ACP కిషోర్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమయింది. మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో భారీ పోలీస్ కవాత్ నిర్వహించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుకోవాలని మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు 427 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నిలక ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం, వెండి, వజ్రాల విలువ 165 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో సరైన పత్రాలు చూపకుండా తీసుకెళ్తున్న 90 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓటరు గుర్తింపు కార్డు ఉంటేనే ఓటెయొచ్చనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి అనుమానాలన్నింటికి చెక్ పెడుతూ... తమ దగ్గర ఉన్న ప్రభుత్వ గుర్తింపు కార్డులతో కూడా ఓటు వేయొచ్చని ఈసీ తెలిపింది. భారత ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులైన... ఆధార్, పాన్, జాబ్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, కార్మిక శాఖ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, పాస్ పోర్టు, పింఛన్ డాక్యుమెంట్... ఇలా వీటిలో ఏ కార్డు ఉన్నా ప్రజలు ఓటును వినియోగించుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏదేని ఒక గుర్తింపు కార్డుతో పాటు..... ఓటరు లిస్టులో పేరు మాత్రం తప్పనిసరిగా ఉండాలి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com