CEC: ఎన్నికల ప్రక్రియపై డేగ కన్ను

CEC: ఎన్నికల ప్రక్రియపై డేగ కన్ను
నిశితంగా గమనిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్‌... వేగంగా స్పందిస్తున్న CEC

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎవరైనా అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారే ఫిర్యాదులు రాగానే CEC స్పందిస్తోంది. దర్యాప్తు చేసిన తర్వాత ఆరోపణలు నిజమని తేలితే సదరు అధికారలపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు IAS, IPSలను బదిలీ చేసిన ఎన్నికల కమిషన్ పోలీసు అధికారుల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజాగా మరికొంత మంది పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. అధికార పార్టీ భారాసకు పోలీస్, ఎక్సైజ్ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేత, సనత్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి CEO వికాస్‌రాజ్‌కు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్, BSPకి చెందిన MLA అభ్యర్థుల నుంచి సైతం ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపై నిజానిజాలు తెలుసుకుంటున్న ఎన్నికల సంఘం ఆ తర్వాత చర్యలు చేపడుతోంది.


ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే 10 మంది IPSలతో పాటు పలువురు IASలు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ బదిలీకి CEC ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చర్యలు తీసుకున్నారు. వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కేంద్రం ఎన్నికల సంఘం నిఘా పెడుతోంది. రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరమయ్యేకొద్దీ... కొంత మంది అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భారాస అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం జరిగిన బదిలీల్లో పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్లకే పోస్టింగ్‌లు దక్కాయని ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తగిన ఆధారాలు ఉన్న వాళ్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీలు చేస్తున్నారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 రోజుల క్రితం 14 మంది CIలను CP సందీప్ శాండిల్య బదిలీ చేశారు. బోరబండ, సైఫాబాద్ PSలతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసే పలువురు CIలను బదిలీ చేసి లూప్‌లైన్‌లోకి బదిలీ చేశారు. SR నగర్ CIగా పనిచేసిన సైదులును బదిలీల్లో భాగంగా కీలకమైన ఉత్తరమండల టాస్క్‌ఫోర్స్‌కు పంపించారు. రాజకీయ పలుకుబడితోనే మంచి పోస్టింగ్ దక్కిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో సైదులును సైబర్ క్రైమ్స్‌కు బదిలీ చేశారు. అచ్చంపేటలో MLA గువ్వల బాలరాజుపై దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలే చేశారంటూ బాలరాజు ఆరోపించారు. పోలీసుల సహకారంతో గువ్వల బాలరాజు డబ్బులు పంచుతుండగా అడ్డుకోవడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలనే CI అనుదీప్ కొట్టడంతో పాటు బెదిరింపులకు దిగారని PCC నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story