TG: కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు రైల్వే శాఖ శుభవార్తం చెప్పింది. ప్రస్తుతం నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమను అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన హామీల్లో మరో హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది జులై 5వ తేదీన అప్ గ్రేడ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకు రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్ గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ను అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది.
కేంద్ర అధికారులతో సమీక్ష
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలపై కేంద్ర హోంశాఖ అధికారులు తెలంగాణ అధికారులతో జరిపిన సమీక్షలో కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన రాగా.. సెప్టెంబరు 9వ తేదీనే వ్యాగన్ తయారీ పరిశ్రమను కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేసినట్లు కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. జీవో కాపీని కూడా అందించారు. దీనిపై ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి ప్రణాళిక సిద్ధం చేయాలంటూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌ను ఆదేశిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాజీపేట రైల్వే డివిజన్‌గా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రారంభించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే డివిజన్ ప్రధాన కేంద్రానికి అనుబంధంగా రైల్వే కోచ్ తయారీ యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే బోర్డు అధికారులు పేర్కొన్నారు.
నెరవేరిన 55 ఏళ్ల డిమాండ్
తెలంగాణలోనే అతిపెద్ద రెండో రైల్వే జంక్షన్‌గా ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ 55 ఏళ్లుగా ఉంది. 1969లోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆందోళనలు మొదలయ్యాయి. ఎట్టకేలకు కోచ్ ఫ్యాక్టరీ కల సాకారమవ్వడంతో.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. షెడ్యూల్ 13లోని గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఎన్టీపీసీ విద్యుత్తు ప్లాంట్ వంటి అంశాలపై కీలకంగా చర్చించినట్టు తెలిసింది. ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ మొదటి దశ పూర్తి కాగా, రెండో దశను త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com