Telangana Rains: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ అధికారులు.. హైపవర్ కమిటీ నిర్ణయం..

Telangana Rains: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందంరాష్ట్రంలో పర్యటించనుంది.. తెలంగాణలో భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలతో గోదావరి పరివాహక ప్రాంతం అతలాకుతలం అయ్యింది. ప్రాజెక్టుల నుండి సమార్ద్యానికి మించి నీరు దిగువకు విడుదల అయ్యింది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో ప్రజలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల కారణంగా ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.
వారంరోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. మరోవైపు వరదలతో భారీ స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. దాదాపు మూడు దశాబ్దాల నుండి ఈ స్థాయిలో వరదలు రాలేదని అధికారులు అంటున్నారు. ఓ దశలో నీటి వరదను తట్టుకునే సామార్ధ్యం ప్రాజెక్టులకు ఉందా లేదా అన్న అనుమానం కూడా వ్యక్తం అయ్యింది. దీంతో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో పాటు కరకట్టలు దాటి బయటకు వచ్చిన నీటితో లక్షలాది ఎరకాల్లో పంట నష్టం వాటిల్లింది.
వెసిన పంట మొలకస్థాయిలోనే నీటమునగడంతో రైతులు లబోదిబో అంటున్నారు. పదిరోజులుగా పంట నిటిలోనే ఉండటంతో మొలకలు పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .. పెట్టిన పెట్టుబడి పూర్తిగా నీటిపాలైందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక వరద కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ ప్రజా ప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు బాధితులు. వరదలపై సమీక్ష చేసేందుకు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించగా , గవర్నర్ తమిళి సై రైలుమార్గంలో కొత్తగూడెంలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు.
పోటాపోటీ పర్యటనలతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. గవర్నర్ వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నందునే కేసీఆర్ ఆగమేఘాల మీద వరద ప్రాంతాల్లో పర్యటించారంటూ విమర్శించింది బీజేపీ. మరోవైపు కేసీఆర్ ఈ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపైన కూడా తీవస్థాయిలో మండిపడుతున్నారు బీజేపీ నేతలు . క్లౌడ్ బరస్ట్ అయ్యిందని.. దీని వెనక విదేశీ కుట్ర ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకు పడ్డారు. ఇక తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కూడా వరద నష్టంపై కేంద్ర పభుత్వం నుండి సాయం కోసం పట్టుబట్టడంలో విఫలం అయ్యారంటూ విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఓ వైపు రాష్ట్రంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే టీఆర్ఎస్ నేతలు బురద రాజకీయాలు చేస్తోంది అంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు.
మరోవైపు వరద బాధితులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసారు బీజేపీ ఎంపీలు. బండి సంజయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ , బీజేపీనేతలు అమిత్ షాను కలిసి వరదసాయం చేయాలని కోరారు. బీజేపీ నేతల విజ్ఞప్తులకు స్పందించిన అమిత్ షా రాష్ట్రానికి హైపవర్ కమిటీని పంపేందుకు ఆదేశాలు జారీ చేసారని తెలిపారు బీజేపీ నేతలు . త్వరలోనే ఈ కమిటీ తెలంగాణలో పర్యటించి.. వరద నష్టాన్ని అంచనా చేసి కేంద్రానికి నివేదిస్తుందని తెలిపారు. కేంద్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బీజేపీ ఎంపీలు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com