లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారాన్ని కొట్టిపారేసిన కేంద్రం..!

లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. మే 3 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీటిపై కేంద్రం స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో-PIB ఫ్యాక్ట్ చెక్ చేసి స్పష్టతనిచ్చింది. ఈ నెల 3 నుంచి 20 వరకు దేశంలో పూర్తి లాక్‌డౌన్ పెడతారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
అయితే ఆ వార్తలను PIB కొట్టిపారేసింది. ఆ పోస్టులు అవాస్తవం... కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటనేమీ చేయలేదని PIB ట్విటర్‌లో వెల్లడించింది. లాక్‌డౌన్ అవసరం ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఇటీవలే సూచించింది. మే 31 వరకు కరోనా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com