తెలుగు రాష్ట్రాల సీజేల బదిలీ ఉత్తర్వుల జారీ

తెలుగు రాష్ట్రాల సీజేల బదిలీ ఉత్తర్వుల జారీ
డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టు కొలీజియం మొత్తం 15 మంది న్యాయమూర్తులను బదిలీచేస్తూ సిఫార్సు చేసింది.

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ ఉత్తర్వులను కేంద్ర న్యాయశాఖ జారీచేసింది. ఏపీ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు, అక్కడి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామిని ఏపీకి బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్‌ 14న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

అదే రోజు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు బదిలీచేసి, ఆ స్థానంలో దిల్లీ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండోస్థానంలో ఉన్న జస్టిస్‌ హిమా కోహ్లిని ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.

ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. వీరితోపాటు ప్రస్తుతం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీచేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టు కొలీజియం మొత్తం 15 మంది న్యాయమూర్తులను బదిలీచేస్తూ సిఫార్సు చేసింది. అందులో నలుగురు ప్రధాన న్యాయమూర్తులు, అయిదుగురు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందినవారు, ఆరుగురు న్యాయమూర్తులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story