CEO Vikas raj: సెలవుల్లోనే రోడ్‌షోలు, 85 ఏండ్లు దాటితే ఇంటి నుంచి ఓటు

సార్వత్రిక నగారాతో రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాగం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ సమీక్ష నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బీఆర్కే భవన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిఘాను పెంచి రాష్ట్ర సరిహద్దులు మొదలు.అన్ని జిల్లాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలింపు, నిల్వలపై నిఘా పెంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రకటనలను ఆదివారం సాయంత్రంలోగా తొలగించాలని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు.
కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు హైదరాబాద్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఎన్నికలను ప్రభావితం చేసేలా నగదు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, బైండోవర్ కేసుల ప్రక్రియా.. కొనసాగుతుందని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ ప్రకటనలు తొలగించాలని ఎలాంటి అడ్‌హాక్ నియామకాలు చేపట్టకూడదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల బదిలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com