Cyberabad: హైదరాబాద్‌లో సన్ బర్న్ వేడుకలకు అనుమతి లేదు: సైబరాబాద్ సీపీ

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లో "సన్ బర్న్" నిర్వహించనున్న న్యూఇయర్ వేడుకకు అనుమతి లేదని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి పొందకముందే "బుక్ మై షో"లో టికెట్లు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు... బుక్ మై షో MDసహా నోడల్ అధికారికి నోటీసులు జారీచేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు నగరాల్లో జరిగే సన్ బర్న్ ఈవెంట్ మరోసారి చర్చనీయాశంగా మారింది. కలెక్టర్లు, SPల సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిసిందని.... దీనికి ఎలా అనుమతులిచ్చారని పోలీసు అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పార్టీలు నిర్వహిస్తున్న సన్ బర్న్ పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సమావేశంలో పోలీసులను ఆదేశించారు. సన్ బర్న్ పార్టీకి బుక్ మై షోలో టికెట్లు అమ్ముతున్నారని, అనుమతి లేకుండా డిసెంబర్ 31 రాత్రి సన్ బర్న్ పార్టీకి సంబంధించి టికెట్లు విక్రయిస్తున్నారని తానే స్వయంగా చూశానన్నారు. దీనిపై సైబరాబాద్ సీపీ చర్యలు తీసుకోవాలని నిన్న జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఈవెంట్స్ ను ఆదాయ వనరులుగా చూడకూడదన్నారు. యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి ఈవెంట్లకు అనుమతి ఇవ్వొద్దన్నారు. హుక్కా సెంటర్స్, పబ్స్ లో జరిగే అనైతిక వ్యవహారాలు, సన్ బర్న్ పార్టీలపై చాలా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారాల్లో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టొదంటూ పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఈ అంశాన్ని CM ప్రస్తావించిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు.. ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించి మందలించారు. అనుమతులు పొందకుండానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడంపై... నిర్వాహకుడు సుశాంత్ అలియాస్ సుమంత్ నానిపై చీటింగ్ కేసు నమోదుచేశారు. బుక్ మై షో MDసహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేసినట్లు మాదాపూర్ అదనపు డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే బార్లు, రెస్టారెంట్ల నిర్వహకులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి వారికి నియమ నిబంధనలు జారీ చేసినట్లు అదనపు DCP తెలిపారు. అన్ని అనుమతులు పొందాకే వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అశ్లీల నృత్యాలు, డ్రగ్స్, 45 డెసిబుల్స్‌కు మించిన శబ్దాలు సహా ప్రభుత్వ నిబంధనలేవీ ఉల్లంఘించినా.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com