Chicken Sales: పండుగ స్పెషల్.. 60 లక్షల కిలోల చికెన్..

Chicken Sales: ఏదైనా పండుగ వస్తే.. చాలావరకు ఇళ్లల్లో మందు, విందు అనేది ఏ మాత్రం తగ్గకుండా లాగించాల్సిందే. సంక్రాంతి, దసరా, న్యూ ఇయర్.. ఇలా పండగ ఏదైనా.. నచ్చింది తినడంలో చాలామంది వెనకాడరు. అందులోనూ ముఖ్యంగా చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ ఆహార పదార్థాలే ఎక్కువ. అందుకే ఈ సంక్రాంతికి కూడా హైదరాబాద్ ప్రజలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రికార్డ్ స్థాయిలో చికెన్‌ను లాగించేశారు.
2022 న్యూ ఇయర్‌కు జరిగిన మటన్, మద్యం అమ్మకాల గురించి ఇంకా మరువక ముందే సంక్రాంతికి కూడా అదే రేంజ్‌లో చికెన్ అమ్ముడుపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చికెన్ ఈ రేంజ్‌లో అమ్ముడుపోవడానికి ధర కూడా ఓ కారణం కావచ్చు. మటన్ ధర కంటే చికెన్ ధర తక్కువగా ఉండడం వల్ల ప్రజలు చాలావరకు చికెన్‌కే ఓటెసినట్టు అర్థమవుతోంది.
సంక్రాంతి సమయంలో చికెన్ ధర దాదాపు రూ. 240గా ఉంది. అయితే మామూలుగా నగరంలో రోజుకు 10 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోతుందని, కానీ సంక్రాంతి సమయంలో ఏకంగా 60 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోయిందని వ్యాపారులు చెప్తున్నారు. మటన్ అయితే రెండు లక్షల కిలోలు మాత్రమే అమ్ముడుపోతుందని, పండగ సందర్భంగా ఈసారి 10 నుండి 15 లక్షల విక్రయం జరిగిందని వారు అంటున్నారు.
ముఖ్యంగా శుక్ర, శనివారాలతో పోలిస్తే చికెన్, మటన్ విక్రయాలు కేవలం ఆదివారమే ఎక్కువగా జరిగాయి. ఆదివారం ఒక్కరోజే చికెన్ 30 లక్షల కిలోలు అమ్ముడుపోయిందని వ్యాపారులు స్పష్టం చేశారు. మటన్ అయితే ఆ ఒక్కరోజే 5 లక్షల కిలోలు అమ్ముడుపోయిందని వారు అంటున్నారు. ఇలా సంక్రాంతిని ఫుల్‌గా నాన్ వెజ్‌తో సెలబ్రేట్ చేసుకున్నారట హైదరాబాద్ వాసులు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com