TG: బిగిస్తున్న సీఎంఆర్ఎఫ్ ఉచ్చు

పేదలకు కష్టకాలంలో అపన్న హస్తం అందించి, వైద్య ఖర్చుల నిమిత్తం ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ ఇప్పుడు ప్రవేటు దవాఖానల పాలిట వరంగా మారింది. అందినకాడికి నకిలీ బిల్లులు తయారు చేసి కోట్లు దండుకుంటున్నారు. ఉన్నదిలేనట్టు, లేనిది ఉన్నట్లు కనికట్టు విద్యలు ప్రదర్శించి ప్రభుత్వ ఖజానకు గండి కొడుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే సీఎం రిలీఫ్ ఫండ్ లో అవకతవకలు చోటు చేసుకున్నాయని తాజాగా సీఐడీ గుర్తించింది. నకిలీ పేషెంట్లు, నకిలీ బిల్లులతో కొన్ని దవాఖానలు భారీ స్కామ్ నడిపినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. లేని రోగులను, రోగాలను సృష్టించి ఎలాంటి ఆపరేషన్ ఎక్విప్‌మెంట్ లేకపోయినా, ఆపరేషన్లు చేసినట్టు నకిలీ బిల్లులు చూపించి ఆయా దవాఖానల యాజమాన్యాలు రూ.కోట్లు దండుకున్నాయి.
ఈ క్రమంలోనే సుమారు 28 ప్రైవేట్ దవాఖానలు కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ సొమ్మును కాజేశాయి. సీఎంఆర్‌ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ డాక్టర్ డీఎన్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతకాల ఫోర్జరీ, చీటింగ్ వంటి అంశాలపై తెలంగాణ సీఐడీ అధికారులు ఆరు ఎఫ్‌ఐఆర్‌లు, 17 కేసులు నమోదు చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌లోని వ్యక్తులు, ప్రైవేట్ దవాఖానల యాజమాన్యం, కొందరు ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది, అకౌంటెంట్ ఆఫీసర్లు అంతా చైన్‌లింక్‌గా ఏర్పడి ఈ భారీ మోసానికి తెరలేపినట్టు సీఐడీ గుర్తించింది.
నకిలీ బిల్లులు.. మాములే
ఈ ప్రైవేట్ దవాఖానలకు రెఫరెన్స్‌గా వస్తున్న ప్రభుత్వ డాక్టర్ల సంతకాలు సైతం బిల్లులపై ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. ఫలానా శస్త్రచికిత్సకు ఫలానా రోగి తమ హాస్పిటల్‌లో జాయిన్ అయినట్టు నకిలీ లేఖలు ప్రభుత్వానికి పంపడం, డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ప్రైవేట్ దవాఖానల్ల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ఓ చైన్‌లింక్‌గా ఏర్పడి.. డబ్బులు దండుకునేలా పథకం రచించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎవరున్నా.. అరెస్టే
ఈ నకిలీ బిల్లుల్లో పేర్కొన్న రోగుల్లో ఏ ఒక్కరు కూడా వైద్యం చేయించుకోలేదు. అయితే వీరంతా వైద్యం చేసుకున్నట్టు, వాటికి బిల్లులు అయినట్టు రికార్డులు ఉన్నాయి. విచారణలో అవన్నీ నకిలీ బిల్లులుగా సీఐడీ అధికారులు తేల్చారు. వీటి వెనుక ఉన్నవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారుల, ప్రైవేట్ వైద్యుల హస్తం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత.. సూత్రధారులు, పాత్రధారులను అరెస్టు చేయనున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ హయాంలోనే..
హైదరాబాద్ , ఖమ్మం , నల్గొండ, వరంగల్ , మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలోని మొత్తం 30ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరు కేసులను సీఐడీ నమోదు చేసింది. బీఆర్ఎస్ హయాంలో గతేడాది ఏప్రిల్ కు ముందు ఈ దందా కొనసాగించాయని ఎఫ్ఐఆర్ లో సీఐడీ పేర్కొంది. సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్ మాల్ పై ఓ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ.. పలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకాన్ని బయటపెట్టింది. ఇప్పటికే ఆసుపత్రులపై కేసులు నమోదు చేసిన సీఐడీ.. ఇప్పుడు ఈ స్కామ్ వెనక ఎవరెవరి పాత్ర ఉందో తేల్చే పనిలో పడింది. ఈ కేసులో గతంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్ కార్యాలయం స్పందిస్తూ.. అతనిని ఎప్పుడో విధుల నుంచి తొలగించామని, అతనితో హరీష్ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com