Ts News: అమ్మాయి దక్కదని స్నేహితుడి హత్య

తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ యువతితో చనువుగా ఉంటున్నాడన్న అసూయతో తోటి స్నేహితుడిని ఇతరులతో కలిసి ఓ మైనర్ దారుణంగా హత్య చేశాడు. వారం తర్వాత మిస్టరీ వీడిన ఈ హత్య కేసు విచారణలో దారుణ విషయాలు వెలుగు చూశాయి. కూకట్‌పల్లి పరిధి అల్లాపూర్‌కు చెందిన అహ్మద్, అన్వరీ బేగం కుమారుడు డానిష్ (17) యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
అదే కళాశాలలో ఓ రౌడీషీటర్ కుమారుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయితో చనువుగా ఉంటున్నాడన్న అసూయతో డానిష్‌ను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 22న డానిష్‌ను రౌడీషీటర్ కుమారుడు బోరబండ రైల్వేస్టేషన్ ప్రాంతానికి పిలిపించాడు. అప్పటికే అక్కడ స్నేహితులతో కలిసి గంజాయి తాగారు. డానిష్ రాగానే.. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న బీరు సీసాలతో డానిష్‌ను విచక్షణారహితంగా పొడిచారు.
అప్పటికీ చనిపోకపోవడంతో గొంతు పిసికి హత్యచేశారు. చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని దగ్గరలో ఉన్న రైలు పట్టాలపై పడేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఘటనా స్థలంలో లభించిన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు హత్యకు పాల్పడిన ఐదుగురు మైనర్లతోపాటు సహకరించిన జహీర్, అమెర్, షోయజ్, రేహాన్, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించగా మరో ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com