Telangana: తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయం.. రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతిభవన్

Telangana: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతిభవన్ అన్నట్లుగా ఉంది. ఈనెల 12న రామగుండానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకుని తీరుతామని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన కర్మాగారాన్ని ఇప్పుడు ప్రధాని ప్రారంభించడం ఏమిటంటూ టీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీతో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు గొంతు కలుపుతున్నాయి. రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రకటించాయి.
మరోవైపు గవర్నర్, ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంతో యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ మరికాస్త ఆలస్యం కానుంది. నిజానికి, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయి నుంచి కింది స్థాయి పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి.
వీటి భర్తీకి గతంలో ఉత్తర్వులు జారీ చేసినా.. భర్తీ చేయలేకపోయారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం ఏ యూనివర్సిటీలోని ఖాళీలను ఆ యూనివర్సిటీయే భర్తీ చేసుకునే విధానం ఉంది. ఈ విధానంలో అవకతవకలు జరగడం, నియామకాల్లో జాప్యం జరుగుతుండడంతో అన్ని వర్సిటీల్లో పోస్టుల భర్తీకి నియామక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ అంశంపై గవర్నర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళుతున్నారని టీఆర్‌ఎస్ ఆరోపిస్తుంది.
అటు.. విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఉమ్మడి నియామకాల బోర్డు ఏర్పాటు బిల్లుకు సంబంధించి గవర్నర్ తమిళిసై నుంచి తనకు ఎలాంటి లేఖ రాలేదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. నిజంగా లేఖ వస్తే స్పందిస్తానని వెల్లడించారు. తనకు లేఖ రాయకుండానే రాసినట్లు చెప్పడం సరికాదని అన్నారు.
ఉమ్మడి నియామకాల బోర్డుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వాటిపై రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని గవర్నర్ మొన్న విద్యాశాఖ మంత్రికి లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. బిల్లును పంపించిన వెంటనే అభ్యంతరాలు తెలిపితే వాటిని నివృత్తి చేసేవారమని, 54 రోజుల పెండింగ్ అనంతరం ఇప్పుడు సమాచారం అడగడం భావ్యం కాదన్నారు.
విశ్వవిద్యాలయాల అభివృద్ధి, విద్యార్థులకు లబ్ధి, నిరుద్యోగులకు మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డుపై నిర్ణయం తీసుకుందని, దీన్ని మంత్రిమండలి ఆమోదించిందన్నారు సబితాఇంద్రారెడ్డి. రాష్ట్ర శాసనసభ, మండలిలో విస్తృతంగా చర్చించి, ఏకగ్రీవంగా ఆమోదించారని గుర్తుచేశారు.
బిల్లు పెండింగులో ఉండడం వల్ల నియామకాల్లో జాప్యం జరుగుతోందని, వెంటనే నియామకాలు చేపట్టాలని విద్యార్థులు, నిరుద్యోగులు కోరుతున్నారని తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి గవర్నర్ లేఖ రాశారని, అందులో విద్యాశాఖ మంత్రిని రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని సూచించినట్లు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక.. గతంలో కూడా గవర్నర్, ప్రభుత్వం మధ్య అనేక అంశాల్లో విభేదాలు ఉన్నాయి. గవర్నర్ పర్యటనల్లో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ స్వయంగా తమిళిసై ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమిళిసై బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు.
అంతేకాదు ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కూడా హాజరు కాలేదు. మరోవైపు ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు టీఆర్‌ఎస్ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com