అప్పులతో తెలంగాణను BRS దివాలా తీయించింది: భట్టి

ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని సీఎల్పీ భట్టి విక్రమార్క విమర్శించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గం తాటికల్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దొరల ప్రభుత్వం వద్దు.. ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందామని భట్టి పిలుపునిచ్చారు. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేసిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొలువులు రాక విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తల్లిదండ్రుల ఆశలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కావడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. పేదలకు ఇళ్లు లేవని.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇస్తే.. ప్రస్తుత ప్రభుత్వం కోత పెట్టి ఒకరికే ఇస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు ఇస్తామని.. రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామన్న ఆయన.. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందిస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇళ్ల స్థలాలు లేని పేదలను గుర్తించి వారికి స్థలాలు కొనుగోలు చేసి ప్లాట్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com