త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న కేసీఆర్ దత్తపుత్రిక..

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. హైదరాబాద్ విద్యానగర్‌లో ఓ హోటల్‌లో రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్ధ వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యూష నిశ్చితార్ధ వేడుకలను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు.
2017లో కన్నతండ్రి, పినతల్లి వేధింపులతో చావు బ్రతుకుల మధ్య ప్రత్యూష ఆస్పత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆమెను పరామర్శించి ప్రత్యూషను తన దత్త పుత్రికగా ప్రకటించారు. ఆమె సంరక్షణ బాధ్యతను ఐఏస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యూష యోగ క్షేమాలను చూస్తోంది. అనంతరం నర్సింగ్ కోర్సును పూర్తి చేసిన ప్రత్యూష ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది.
ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న చరణ్ రెడ్డి ప్రత్యూష గురించి తెలుసుకుని ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించి విషయం తెలియజేశాడు. వారు వీరి వివాహ ప్రస్తావనను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా.. వెంటనే స్పందించిన కేసీఆర్.. ప్రత్యూషను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడారు. చరణ్ వివరాలు అడిగి తెలుసుకుని నిశ్చితార్ధ ఏర్పాట్లు పర్యవేక్షించాలని శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యను ఆదేశించారు. మీడియాతో మాట్లాడిన ప్రత్యూష తన వివాహానికి సీఎం కేసీఆర్ వస్తానని చెప్పినట్లు తెలిపింది. మంచి కుటుంబంలోకి వెళుతున్నందుకు ఆనందంగా ఉందని ప్రత్యూష సంతోషం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com