KCR: కాంగ్రెస్‌ వస్తే మళ్లీ లంచాల కాలం

KCR: కాంగ్రెస్‌ వస్తే మళ్లీ లంచాల కాలం
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కేసీఆర్‌ పిలుపు.... అధికారంలోకి అసైన్డ్‌ భూములకు హక్కులు ఇస్తామని హామీ

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారానికి వస్తే మళ్లీ లంచాల కాలం వస్తుందని, రైతుబంధు డబ్బుల్లో అధికారులు వాటా అడుగుతారని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్‌, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. వికారాబాద్ జిల్లాకు కృష్ణాజలాలను తీసుకొచ్చే బాధ్యత తనదేనన్న కేసీఆర్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గం మొత్తానికి ఒకేసారి దళితబంధు అమలు చేస్తామన్నారు. రైతుబంధు దుబారా, 24 గంటల కరెంటు వృధా అనికాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడిన కేసీఆర్‌ ఆ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ అరాచకమేనని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే అసైన్డ్ భూములు లాక్కుంటుందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. అసైన్డ్‌ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు.


కాంగ్రెస్ కి ఓటు వేస్తే మరోసారి తెలంగాణలో రాష్ట్రంలో దళారుల రాజ్యం రావడం ఖాయమని ముఖ్యమంత్రి KCR పునరుద్ఘాటించారు. ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయకుంటే పదేళ్లుగా తాము చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని పేర్కొన్నారు. హస్తంపార్టీ అధికారంలోకి వచ్చి ధరణీని తొలగిస్తే మళ్లీఅరాచకమేనని హెచ్చరించారు. ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఇస్నాపూర్ వ‌ర‌కు మెట్రో వ‌స్త‌ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోట‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు కూడా మెట్రో వ‌చ్చేస్తే ప‌టాన్‌చెరు ద‌శ‌నే మారిపోత‌ది అని కేసీఆర్ పేర్కొన్నారు . కాంగ్రెస్‌కు నమ్మి ఓటేస్తే కర్నాటకలో గతే చేస్తారని, మనవేలుతోనే మన కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తారని కేసీఆర్‌ హెచ్చరించారు. అక్కడ ఐదు గంటల కరెంటు ఇస్తున్నారని.. తెలంగాణలోనూ అదే పరిస్థితిని తీసుకువస్తారన్నారు.


ద‌ళితులు ఆర్థికంగా ఎద‌గాల‌నే ఉద్దేశంతో హుజురాబాద్ నియోజ‌కవ‌ర్గంలో ఒకే విడత‌లో ద‌ళిత‌బంధు అమ‌లు చేశామ‌ని, ఇప్పుడు అక్కడ ద‌ళిత వాడ‌లు.. దొర‌ల వాడ‌ల మాదిరిగా త‌యారు అయ్యాయ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. త‌ర‌త‌రాలుగా దోపిడీకి గుర‌ైన ద‌ళిత స‌మాజానికి... అణిచివేత‌కు వివ‌క్షకు గురైన స‌మాజానికి తాము ఎంతో చేశామని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ గ‌వ‌ర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే దళితుల్లో ఇంకా పేద‌రికం ఎందుకు ఉందని కేసీఆర్‌ ప్రశ్నించారు. దళితుల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారని మండిపడ్డారు. అమ్మను చూడు.. మాకు ఓటు గుద్దు అని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు త‌ప్ప సంక్షేమానికి పాటు ప‌డ‌లేదన్నారు. భార‌త‌దేశంలో ఎక్కడ.. ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ, ఏ ప్రధాని ఆలోచించ‌ని ప‌ద్ధతుల్లో తాము ఆలోచించి ద‌ళిత‌బంధు పెట్టినమని. మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయని కేసీఆర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story